Tomato : టమాటా ధర ఢమాల్.. కిలో నాలుగు రూపాయలు
టమాటా ధరలు పతనమయ్యాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు
టమాటా ధరలు పతనమయ్యాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా ధరలు కుప్పకూలి రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. నెల రోజుల కింద కిలోకు ముప్ఫయి నుంచి నలభై రూపాయలు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు, పత్తికొండ మార్కెట్లలో కిలోకు రూ.4 నుంచి రూ.5 పలుకుతోంది. మదనపల్లె మార్కెట్లోనూ నాణ్యతను బట్టి కిలోకు రూ.8 నుంచి రూ.13కే అమ్ముడవుతున్నాయి.మరోవైపు వ్యాపారులు మాత్రం ఇదే టమాటాను వినియోగదారులకు కిలోకు రూ.20–25కు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టమాటా ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రెండు రూపాయలకు కూడా మార్కెట్ లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదు
దిగుబడులు ఎక్కువై...
టమాటా కోయడానికి రైతులు కూలీలకు చెల్లించాల్సిన మొత్తం కూడా రాదని తెలియడంతో దానిని కోయడం అనవసరమని పొలాల్లోనే వదిలేస్తున్నారు. పశువులకు మేతగా తీసుకెళ్లవచ్చని కొన్ని చోట్ల పశువుల కాపర్లకు రైతులు చెబుతున్నారు. దీంతో టమాటా ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా నవంబరు మాసం నుంచి టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతుంటాయి. అందుకే కావాల్సిన దానికన్నా ఎక్కువ టమాటా మార్కెట్ లోకి వస్తుంది. దీని వల్ల ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా ధరల రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఏటా నష్టాలే...
టమాటా రైతులు ఏటా నష్టాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి లాభాలు వస్తుండటంతో ఆశతో టమాటాను పండించడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ టమాటా రైతు పరిస్థితి లాటరీలా మారింది. రైతుల్లో సరైన అవగాహన లేకపోవడం, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో ఏటా విఫలమవుతున్నారు. ప్రధానంగా టమాటా పండించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎన్ని ఎకరాల్లో వేయాలన్న దానిపై రైతుల్లో అవగాహన కల్పించినట్లయితే కొంత డిమాండ్ కు తగినట్లుగానే దిగుబడి వస్తుంది. అప్పుడు రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని పాలకులు బయటకు చెబుతున్నా అది ఆచరణ సాధ్యంలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.