Telangana : తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరి పండించే రైతులకు తీపి కబురు అందించింది. ధాన్యం రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ514.36 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. క్వింటాల్‌కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ది పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1,939.58 కోట్ల రూపాయల బోనస్‌ను చెల్లించింది. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
సన్నబియ్యం పంపిణీతో...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి పంటను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది. ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇలా బోనస్ ఇవ్వడం లేదు. దీంతో పాటు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించడానికి రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ఇటు రైతుల నుంచి ధాన్యం సేకరించడంతో పాటు అటు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడంవల్ల తెలంగాణలో వరి ఉత్పత్తి దేశంలోనే పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో...
రైతుల సంక్షేమం కోసమే ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపులు, గిట్టుబాటు ధరతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. పెండింగ్ బకాయిలు విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు ధాన్యం తీసుకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది.