తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది. పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా నిధులు డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఎప్పుడంటూ రైతులు ఆశతో ఎదురు చూసతున్నారు. . మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరగగా, 13వ తేదీన కౌంటింగ్ జరిగింది. 16,17తేదీల్లో గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. దీంతో మంగళవారం నాటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన...
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను అధికార పార్టీ సాధించ డంతో ఈ యాసంగి సీజన్ కోసం రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ మండల, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు గాను సత్వరమే రైతుభరోసా సాయాన్ని రైతులఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కావాల్సిన సుమారు 9 వేలకోట్ల రూపాయలను ఆర్థికశాఖ సమీకరిస్తున్నది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సాగు భూములకే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెబుతున్నది. వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. యాసంగి సీజన్‌లో సాగునీటిని బట్టి కొంత విస్తీర్ణం తగ్గుతుంది. కానీ ప్రభుత్వం ఆ లెక్కల జోలికి పోకుండా వానాకాలం సీజన్‌లో పట్టా భూములు కలిగిన ఎంతమంది రైతులకు రైతు భరోసా కింద సాయాన్ని అందించామో వారందరికీ, ఇంకా మిగిలిపోయిన వారందరికీ డబ్బులు జమ చేయాలనే ఆలోచన చేసినట్లు సమాచారం.
సాంకేతిక సమస్యలు...
పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ఈ యాసింగి సీజన్‌కు ముందు నిర్ణయించి సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా డబ్బులు జమ చేయాలని భావించారు. ఈ సర్వే వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు పంటలు సాగుచేసిన రైతులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందకుండా పోయే ప్రమాదం ఉందని గమనించిన ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో పంటలు సాగుచేసిన రైతులందరికీ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అధికార వర్గాలకు సమాచారం ఇచ్చిందని తెలిసింది. ఎకరానికి రెండు పంటలకు కలిపి 15 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా నిలిచి పోయిన రైతుబంధు పథకం డబ్బులను 2024జనవరిలో రైతుల ఖాతాల్లో జమచేసింది. అదే ఏడాది వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు. కానీ రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేశారు. సాంకేతిక కారణాల వల్ల సర్వేలో జాప్యం జరుగుతుండడంతో వానాకాలం సీజన్‌లో డబ్బులు జమ చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం