Rythu Bharosa : ఇక వారికే రైతు భరోసా.. మిగిలిన వారి నో ఛాన్స్
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వానాకాలం, యాసంగి పంటల సాగు సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 'రైతు భరోసా' పేరిట అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఆ నగదు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, రైతుభరోసా డబ్బులు ఎప్పుడు పడతాయనే అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.. కానీ, తాజాగా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధుల జమ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నార.
త్వరలోనే నిర్ణయం...
రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై నిర్ణయం తీసుకోలేదు కానీ దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికీ కాకుండా, వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది.
శాటిలైట్ మ్యాపింగ్...
కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో20లక్షల ఎకరాలుకనిపిస్తున్నట్లు తెలిసింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్యభూమి ఉంటే.. 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి.
ఈ నెల 14 తర్వాత...
ఈ శాటిలైట్ మ్యాపింగ్ తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడనుంది.సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని, గ్రామాల్లో సర్వే నెంబర్లవారీగా ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి కచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని సమాచారం. అగ్రికల్చర్ యూనివర్శిటీ రూపొందించిన పంట వివరాలను ఈనెల 14 తరువాత ప్రభుత్వానికి అందిస్తే.. టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.