Revanth Reddy : వరంగల్ వరద బాధితులకు భారీ సాయం
వరంగల్ లో ముంపు ప్రాంతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు
వరంగల్ లో ముంపు ప్రాంతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరదల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదులక్షల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. పంట నష్టం జరిగిన వారికి ఎకరాకు పది వేల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు. సమ్మయ్య నగర్ లో వరద బాధితులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు.ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి హనుమ కొండ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిరాశ్రయులైన వారికి...
వరదలో నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. వరంగల్ కు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరారు. పది మంది కబ్జాలు చేయడం వల్ల వందలాది మంది ఇబ్బంది పడాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణపనులను వేగవంతం చేస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ నిధులను వినియోగించుకోవాలని, భవిష్యత్ లో వరంగల్ కు ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.వచ్చే పదిరోజుల పాటు అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.