Konda Murali : కొండా కుటుంబం కుదురుగా ఉండదా? మళ్లీ ట్రబుల్ లో పడినట్లేనా? ముందే టిక్కెట్లు ప్రకటించుకున్నారా?

వరంగల్ కు చెందిన కొండా మురళి ఫ్యామిలీ ఎక్కడ ఉన్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉంది

Update: 2025-06-20 12:33 GMT

వరంగల్ కు చెందిన కొండా మురళి ఫ్యామిలీ ఎక్కడ ఉన్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా ఉంది. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాల్లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టాలీవుడ్ హీరోల కుటుంబం పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నాడు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అదే సమయంలో తర్వాత మంత్రులుగా ఉన్న వాళ్లు లంచాలు తీసుకోనిదే ఏ పనిచేయరని చేసిన వ్యాఖ్యలు కూడా సొంత పార్టీలో నేతలకు కన్నెర్రకు కారణమయ్యాయి. ఇక తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. సొంత పార్టీ నేతలనే కొండా మురళి లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.

పార్టీ మారిన నేతలపై...
కొండా మురళి వరంగల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సిగ్గుంటే పార్టీ మారినప్పుడు పదవులుకు రాజీనామాలు చేయాలని చేసిన వ్యాఖ్యలు సూటిగా తగిలిన నేతలు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేశానని చెప్పుకునే నేతలు వారు గతంలో పనిచేసిన పార్టీలను భ్రష్టు పట్టించారన్నారు. నాడు తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడిని, తర్వాత బీఆర్ఎస్ లో కేసీఆర్ ఓటమికి కారణమయ్యారని కొండా మురళి కడియం శ్రీహరిని ఉద్దేశించి అన్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి దీనిని కూడా ఆగం చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాశ్ రెడ్డి, బస్వరాజు సారయ్య వంటి వారు కొండా మురళి వ్యాఖ్యలకు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యం సన్నిహితులే.
మూడు టిక్కెట్లు తమకు అంటూ...
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల ముసిలోడు పరకాలకు వచ్చాడని, దరిద్రమైన నాయకుడని, నా రెండు కాళ్లు పట్టుకుని గెలిపించమని అడిగితే తాను సాయం చేశానని కొండా మురళి అన్నారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుస్మిత ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, తాను కూడా ఎమ్మెల్సీ అవుతానని, కొండా సురేఖ కూడా వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తారని కొండా మురళి తనకు తానే టిక్కెట్లను డిక్లేర్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈరోజు కొండా మురళి తమపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి సమావేశమై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద మరోసారి కొండా కుటుంబం ట్రబుల్ లో పడిందనే చెప్పాలి.
Tags:    

Similar News