Revanth Reddy : నేడు మేడారానికి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారానికి బయలుదేరి వెళుతున్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించనున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారానికి బయలుదేరి వెళుతున్నారు. మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు మహా జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పూజారులు, ఆదివాసీ నేతలు, మంత్రులు, గిరిజన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించనున్నారు. మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను గురించి ఆయన అడిగి తెలుసుకోనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే గిరిజన మహాజాతర కు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.
జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై...
తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతుంది. ఇక వారాంతాలు, సెలవు దినాల్లో మరింత రద్దీ ఎక్కువగా ఉండనుంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు అక్కడ భక్తులు స్నానమాచరించడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి నేడు సమీక్షించనున్నారు. పార్కింగ్ సౌకర్యంతో పాటు రహదారుల అభివృద్ధిపై కూడా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి పాట్నాకు బయలుదేరి వెళతారు. రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి పాటా బయలుదేరి వెళ్లనున్నారు.