Visakha : విశాఖ వెళుతున్నారా.. అయితే తక్కువ ఖర్చుతో మీరు ఉండొచ్చు ఇలా?
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్నిప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్నిప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కాస్ట్ లీ లివింగ్ సిటీ. ఇక అక్కడ రెండు రోజులు ఉండాలంటే వసతి కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. విశాఖ తీరాన్ని చూడాలనుకుని వెళ్లే వారికి వసతి సౌకర్యం పెద్ద సమస్యగా మారింది. ఏ రేంజ్ కు ఆ రేంజ్ హోటల్స్ ఉన్నప్పటికీ ధరల మోతతో జేబులు ఖాళీ అవుతున్నాయి. దీంతో పర్యాటకులు విశాఖపట్నం వచ్చినా సరైన వసతి దొరకడం లేదని, తమ స్తోమతకు తగిన రీతిలో స్టే ఒకటి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సాగరతీరంలో అలల అలజడులతో పాటు అనేక అందాలకు నిలయమైన విశాఖను పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది.
ఊతమివ్వాలని...
అందులో భాగంగా విశాఖలో పర్యాటకులకు హోమ్ స్టే లకు ఊతమివ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు 'ఇంటిలో ఆతిథ్యం' ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి కలిగిన విశాఖలో సొంత ఇల్లు కలిగిన యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులుకోరుతున్నారు. ఎవరికైనా సొంత ఇల్లు లేదా విల్లా లేదా అపార్టుమెంట్ లో ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ కోరింది. వీరికి అవగాహన కల్పించి పర్యాటకుల నుంచి ఎంత వసూలు చేయవచ్చో నిర్ణయిస్తారు. సీజన్ ను బట్టిధరలను మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించనున్నారు.
హోమ్ స్టే ఇలా...
పర్యాటకులకు అన్ని ప్రాంతాల్లో హోటళ్లలో గదులు తక్కువ ధరకు లభించవు. మంచి ఆహారం కూడా దొరకదు. చాలామంది పర్యాటకులు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూడాలనుకుంటారు. అక్కడి మనుషులతో మాట్లాడి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, దుస్తులు, స్థానిక కళల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ సాధారణ హోటళ్లలో లభించవు. అటువంటి అభిరుచి కలిగిన వారికి స్థానిక విధానంలో 'వసతి సౌకర్యాలు' కల్పించడాన్ని 'హోమ్ స్టే'గా వ్యవహరిస్తున్నారు. కశ్మీర్, పంజాబ్ వంటి రాషా్ట్రలతో పాటు మలేషియా వంటి దేశాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే బాగా ఆదరణ పొందింది. దీనివల్ల స్థానికులకు కూడా ఉపాధి లభిస్తోంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రచారం పెరుగుతోంది. విశాఖకు వచ్చే పర్యాటకులకు అవసమైనన్ని గదులు పర్యాటక, ప్రైవేటు సంస్థలు సమకూర్చలేకపోతున్నాయి.
స్థానికులకు ఉపాధి...
ఈ హోమ్ స్టే వల్ల పర్యాటకంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్థానికులే వారి గృహాలను అందంగా అలంకరించి, బయట ఉన్న హోటల్ ధరల కంటే తక్కువకే వసతి కల్పిస్తారు. ఇంట్లో వండిన ఆహార పదార్థాలను వండిపెడతారు. వారు బయటకు వెళ్లి వచ్చే లోగా వారి అభిరుచులకు తగినట్లు స్థానిక ఆహారాన్నివేడివేడిగాఅందిస్తారు. ఇది పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. తక్కువ ఖర్చుతో స్టే తో పాటు ఆహారం కూడా లభించడం వల్ల పర్యాటకులు మరికొద్ది రోజులు స్టే చేసే అవకాశముంటుంది. దానివల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు స్ధానికులకు కూడా ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ స్టేను కొత్త పర్యాటక పాలసీలో చేర్చింది. కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు పేర్లు నమోదు చేయించుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వెబ్‌సైట్‌లో ఆసక్తి కలిగిన వారు వివరాలు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 0891-2754716 నంబరుకు సంప్రదించవచ్చు.