హోదాపై ప్రేమ జనంలో ఉందా లేదా?

Update: 2016-09-26 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే చెప్పలేనంత ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఏపీ అలా లాభపడడమే తమకు కంటగింపు అన్నట్లుగా మోడీ అండ్‌ కో ఆ విషయంలో రిక్తహస్తం చూపించినట్లు తేలిపోయింది. తాము ఇచ్చిందే అద్భుతం అన్నట్లుగా కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. అయితే ప్రజల్లో హోదా పట్ల ఇంకా మమకారం ఉందా.. వారు ప్రభుత్వంతో పోరాడి సాదించుకునే ఉద్దేశంతో ఉన్నారా? అంటూ అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రత్యేకహోదా గురించి రాజకీయం చేసే వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు చేసే కామెంట్లు, ఉద్యమాల సంగతి వేరు. చివరికి కమ్యూనిస్టులు చేసే ఉద్యమానికి కూడా జనస్పందన ఏపాటి ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

వామపక్షాల వారు విజయవాడలో ప్రత్యేకహోదా గురించి ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమానికి ప్రజల్లో ఏమాత్రం చైతన్యం ఉన్నా కాస్త స్పందన ఉండాలి. కానీ కమ్యూనిస్టుల కార్యక్రమం గురించి పట్టించుకున్న వారు లేరు. బ్యాలెట్‌ లో కాసిని ఓట్లు పడాలి గనుక.. పార్టీ నాయకులే పిల్లల్ని పోగేసి ఓట్లు వేయించారు.

దీనిని గమనిస్తే.. హోదా రావడం వల్ల మేలు నిజమే కావొచ్చు. కానీ దానికోసం ప్రయత్నించడం అనేదానిపై ఎవ్వరికీ శ్రద్ధ లేదు. పార్టీలు రాజకీయ కోణంలో మాత్రమే దాన్ని చూస్తున్నాయి. ప్రజలు.. 'వచ్చేలా లేదు కదా, సరే పోన్లెద్దూ' అనుకుంటున్నట్లుగా ఉన్నారు. వాస్తవంగా ప్రజల్లో స్పందన లేకుండా ఉద్యమాన్ని నడపాలని చూస్తే అది సక్సెస్‌ అవుతుందా అనేది ఇప్పుడు జనం ముందున్న సందేహం.

Similar News