Amaravathi : రాజధాని రైతులు రివర్స్.. అసలుకే ఎసరు వస్తుందనా?
రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో ఉన్న క్యాపిటల్ క్రేజ్ క్రమంగా ఇప్పుడు కనుమరుగవుతున్నట్లు కనిపిస్తుంది
రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో ఉన్న క్యాపిటల్ క్రేజ్ క్రమంగా ఇప్పుడు కనుమరుగవుతున్నట్లు కనిపిస్తుంది. పదేళ్ల ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. అంతే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలకు రాజధాని ప్రాంత రైతులు అంగీకరించడం లేదు. ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల క్రితం రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చారు. రాజధాని తమ ప్రాంతానికి వస్తే తమ బతుకులు బాగుపడతాయని విశ్వసించారు. తమ వారసులకు ఆర్థికపరమైన ఇబ్బందులుండవని తలపోశారు. కానీ పరిస్థితి చూస్తుంటే రోజురోజుకూ రివర్స్ అవుతుంది. 2014 నుంచి 2019 వరకూ రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్దగా ముందుకు అడుగు పడలేదు.
నాడు గుండ్రంగా.. నేడు అడ్డంగా...
అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో నాడు ఐదేళ్లు రైతులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని కల సాకారం అవ్వడంతో పాటు తాము కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటామని భావించారు. కానీ ఉన్నది పోయే.. అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని రైతులు రివర్స్ అవుతున్నారు. తాజాగా తమ భూముల్లో హై టెన్షన్ విద్యుత్తు లైన్లను నిర్మించడాన్ని కూడా రైతులు తప్పుపడుతున్నారు. రాజధాని నిర్మాణం అంటే అవన్నీ వస్తాయని తెలియకపోవచ్చు. అందుకే అప్పుడు గుండ్రంగా తలాడించిన రైతులు నేడు అడ్డంగా ఊపుతున్నారు. తాము ఇక భూములను ఇవ్వలేమని మొహం మీదనే చెప్పేస్తున్నారు.
రెండో విడత భూ సమీకరణకు...
రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వానికి కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాభై వేల ఎకరాలున్న రాజధానిలో రెండో విడత భూసమీకరణతో పాటు మందడంలో రోడ్ల వెడల్పు వివాదంగా మారింది. అమరావతి ప్రాంతంలో మందడం పెద్ద గ్రామం కావడంతో ఇప్పటికే ఆ గ్రామం నుంచి వెళ్లేందుకు రహదారులున్నాయి. ఎస్ 7 రోడ్డు, ఎస్ 9 రోడ్లు ఇప్పటికే మందడం నుంచి వెళుతున్నాయి. అయితే తాజాగా ఈ8 రోడ్డు రెండు వందల అడుగుల వెడల్పుతో నిర్మించాలని తలపెట్టింది ప్రభుత్వం. రెండు లక్షల జనాభా కూడా లేని రాజధాని ప్రాంతంలో అంత రోడ్డు అవసరమా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలదోయడం ఏంటని నిలదీస్తున్నారు. పోనీ తమకు ప్రత్యామ్నాయంగా సరైన స్థలాలు ఇవ్వకపోవడంపై కూడా వారు అసహనం చెందుతున్నారు. అందువల్లనే కూటమి ప్రభుత్వంపై రాజధాని రైతుల్లో అసంతృప్తి పెరుగుతుంది. మరి ఇది ఎక్కడదాకా వెళుతుందన్ని చూడాల్సి ఉంది. ఇప్పటికే భూములిచ్చిన అన్నదాతలు కూడా ఆనందంగా లేకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించి ముందడగు వేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.