Cold Weather : చలి దెబ్బ మామూలుగా లేదుగా.. ఇంకా ఎన్నాళ్లు సామీ?

భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే చలితీవ్రత పెరుగుతుంది.

Update: 2025-12-30 03:54 GMT

భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే చలితీవ్రత పెరుగుతుంది. మొన్నటి కంటే నిన్న .. నిన్నటి కంటే నేడు చలితీవ్రత ఎక్కువవుతుండటంతో ప్రజలుబయటకు రావడానికి భయపడిపోతున్నారు. ప్రధానంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత కారణంగానూ, మరొకవైపు ఈ ఏడాది చలితీవ్రత ఎక్కువగా ఉంటుందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. గత పదిహేను రోజుల క్రితం వరకూ కుండ పోత వానలు కుమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలి దెబ్బకు చతికలపడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

చలితీవ్రత ఇంకొన్నాళ్లు...
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర,రాయలసీమల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరొకవైపు ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం గజగజ వణికిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలుమంచు గుప్పిట్లో కూరుకుపోయాయి. అరకు, పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణలో అదే పరిస్థితి...
తెలంగాణలోనూ చలితీవ్రత కొనసాగుతుంది. గత ఇరవై రోజుల నుంచి చలితీవ్రత ఎక్కువగానే ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ చలితీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ జనవరి మొదటి వారం నుంచి చలితీవ్రత తగ్గుతుందని అంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో జనం బయటకు రాలేకపోతున్నారు. వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్,మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News