Chandrababu : ఆ పథకం ఇక మూలనపడినట్లేనా? ఆ ప్రస్తావనే లేదుగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను హడావిడిగా తెచ్చిన పథకాన్ని మూలన పడేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను హడావిడిగా తెచ్చిన పథకాన్ని మూలన పడేశారు. పీ4 పథకాన్ని ప్రవేశపెట్టారు. మార్గదర్శకులను కూడా ఎంపిక చేసి ఈ పథకాన్ని వేగంగా అమలు చేసి పేదరికాన్ని నిర్మూలించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తొలి నాళ్లలో పీ4 పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అంటే సమాజంలో సంపన్నులు పేదలను దత్తతగా తీసుకుని వారికి అవసరమైన విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ప్రకటించిన తర్వాత ఒక మూడు నెలల పాటు సజావుగా జరిగినప్పటికీ తర్వాత పీ4 పథకం విషయం మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. ఎక్కువగా ఆయన ఈ పేరును కూడా ప్రస్తావించలేదు.
ఏ సమావేశంలోనైనా...
అంతకు ముందు ఏ సభలోకి వెళ్లినా... ఏ సమావేశానికి వచ్చినా ముందుగా ప్రస్తావించేది పీ4 పథకం గురించే. పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని మార్గదర్శకులను సూచించారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా పేద కుటుంబాల జాబితాతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సంపన్న కుటుంబాలను మార్గదర్శకులుగా నిర్ణయించి జాబితాను రూపొందించింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరిక రహితంగా మార్చడం, సంపన్నులను పేదల అభ్యున్నతిలో భాగస్వాములను చేయడం, పారదర్శకతతో కూడిన సామాజిక-ఆర్థిక అభివృద్ధిని సాధించడం పీ4 పథకం లక్ష్యం. దత్తత తీసుకున్న వారు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, విద్య మరియు ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యుల్ని చేశారు.
రాజకీయ కారణమేనా?
తొలినాళ్లలో జిల్లాల పర్యటనలకు చంద్రబాబు వెళ్లినా కొన్ని పేద కుటుంబాలను పీ4 కింద చంద్రబాబు ఎంపిక చేసేవారు. కానీ కాలక్రమేణా ఆపథకం పట్ల సానుకూలత పెద్దగా రాకపోవడంతో చంద్రబాబు వెనక్కు తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పథకం ఆశించినంతగా సక్సెస్ కాకపోవడం వల్లనే చంద్రబాబు పీ4 పథకం గురించి ప్రస్తావన చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదని తెలిసింది. కొందరికి ఈ పథకం ద్వారా లబ్ది కలిగితే, ప్రయోజనం పొందని కుటుంబాలు రాజకీయంగా దూరమవుతాయని భావించి క్రమంగా పీ 4 పథకాన్ని క్రమేణా నీరుగార్చినట్లు కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నోటి నుంచి పీ4 పథకం ప్రస్తావన రాకపోవడానికి కూడా రాజకీయ కారణమేనని అంటున్నారు. మొత్తం మీద ఆర్భాటంగా ప్రకటించిన పీ4 పథకం అతి తక్కువ కాలంలోనే అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.