YSRCP : అట్లర్ ప్లాప్ కావడంతోనే జగన్ మనసు మార్చుకున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నూమిన్నూ కానరాలేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నూమిన్నూ కానరాలేదు. కొత్త విధానాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఎవరి సలహాయో తెలియదు కాని సోషల్ ఇంజినీరింగ్ పేరుతో ప్రధానమైన కులాలను తమ వైపునకు తిప్పుకోవాలని జగన్ ప్రయత్నించారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నామస్మరణలు చేస్తూ మిగిలిన సామాజికవర్గాలను మర్చిపోయారన్నది వైసీపీ నేతలే చేస్తున్న విమర్శ. అందుకే రాష్టరంలోని కొన్ని బలమైన సామాజికవర్గాలు పార్టీకి దూరమయ్యాయని, ఫలితంగానే పదకొండు సీట్లకు పరిమితమయ్యాయని వారు బాహాటంగా చెబుతున్నారు. లబ్దిదారుల ఎంపికతో పాటు నగదు బదిలీకి కూడా ప్రధమ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే జగన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో విఫలమయిందంటున్నారు.
కుల రాజకీయాలను...
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక కుల రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నించేసింది. అన్ని కులాలను దగ్గరకు తీసుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన సామాజికవర్గాలకు దూరమయింది. ఎన్నికల్లో అన్ని రకాలుగా పార్టీకి ఉపయోగపడిన వారిని మాత్రం పక్కన పెట్టింది. మరొక వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నినాదంచేస్తూనే సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అణగారిన వర్గాల్లో ఒక కొత్త ఆశను రేకెత్తించింది. కానీ అసలైన నిర్ణయాధికారం, ఆర్థిక లావాదేవీలు, పార్టీ యంత్రాంగంపై పట్టు మాత్రం రెడ్డి సామాజికవర్గం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటంతో వారు కూడా ఎన్నికల నాటికి దూరమయ్యారు.
రాజకీయాలను వ్యాపారంగా కాకుండా...
దీంతో అటు కాకుండా ఇటు కాకుండా అయినట్లయింది వైసీపీ పరిస్థితి. అందుకే ఎక్కువ మంది వైసీపీ నేతలు ఇప్పుడు వాస్తవంలోకి జగన్ వస్తేనే పార్టీని ప్రజలు ఆదరిస్తారంటున్నారు. బీసీ నినాదం ఎంతగా ఎత్తుకున్నా మొన్నటి ఎన్నికల్లో ఫలితం లేకుండా పోయిందని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. లేకుంటే అదే రకమైన వ్యూహాలతో వెళితే ఈసారి కూడా భంగపాటు తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపుతూ మరొకవైపు అన్ని సామాజికవర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు రాజకీయాలను వ్యాపారంగా మార్చవద్దని కూడా చాలా మంది జగన్ కు సూచిస్తున్నారు. అలా అయితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని, లేకుంటే ఉండదన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి.