Tirumala : నేడు కూడా వైకుంఠ ద్వార దర్శనం.. వారికి మాత్రమే అనుమతి
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు ముందుగా టిక్కెట్లు పొందిన వారికి మాత్రమే వివిధ మార్గాల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్నటి నుంచి తిరుమలలో ప్రారంభమయిన ఉత్తర ద్వార దర్శనాలను పది రోజుల పాటు కొనసాగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నిరంతరాయంగా...
తిరుమలలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా స్వామి వారి దర్శనం సులువుగా అయిపోయేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నేడు వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో చక్రస్నానం మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారి పుష్కరణిలో శాస్త్రోక్తంగా అర్చకులు చక్రస్నానాన్ని నిర్వహించారు. ఈరోజు కూడా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
హుండీ ఆదాయం...
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా సర్వ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేసిన నేపథ్యంలో కేవలం టోకెన్లు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,053 మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారికి 16,301 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.25 కోట్ల రూపాయల ఆదాయం ఉందని వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.