Amaravathi : రెండో దశ భూ సమీకరణకు సిద్ధమయిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో రెండో దశ భూసమీకరణకు సిద్ధమయింది

Update: 2025-12-30 04:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో రెండో దశ భూసమీకరణకు సిద్ధమయింది. రెండో దశలో దాదాపు పదహారు వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో రెండోదశ పూలింగుకు సంబంధించి వచ్చే నెల మూడో తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలునానయని తెలిసింది. కొత్త ఏడాది ఆరంభం నుంచే రెండో దశ భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రామ సభలను నిర్వహిస్తూ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లు రైతులను ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కొందరు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వస్తుండగా మరికొందరు ఆసక్తి చూపడం లేదు.

రాజధానిలో మరిన్ని అవసరాల కోసం...
అమరావతి రాజధానిలో మరిన్ని అవసరాల కోసం రెండోదశ పూలింగు నోటిఫికేషన్ ను జనవరి 3వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత టిడిపి పాలనలో రాజధాని ప్రక్రియ జనవరిలోనూ మొదలైందని, ఇప్పుడు కూడా జనవరిలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో ఏడు గ్రామాల నుండి భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 27 జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్నిసీఆర్డీఏ కమిషనర్ కు ప్రభుత్వం అప్పగించింది. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు.
నోటిఫికేషన్ తర్వాతనే...
దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మంత్రి నారాయణకు అందజేశారు. కొందరు మాత్రం తొలిదశలో భూ సమీకరణ చేసిన రైతులకు ప్లాట్లు అప్పగించి, వాటిని అభివృద్ధిని చేసిన తర్వాత మాత్రమే తాము ఇస్తామని చెబతున్నారు. మరికొందరు కొన్ని షరతులు పెడుతున్నారు. కౌలు మొత్తాన్ని పెంచాలని, తమకు కూడా తాము కోరుకున్న నివేశన, వాణిజ్య స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. మరి రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి క్లారిటీ రానుందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News