వైకాపా చెప్పే లోపాలను పట్టించుకోవాల్సిందే! కానీ,

Update: 2016-11-25 08:15 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుదీర్ఘ కాలం తర్వాత ఇవాళ వెలగపూడి సచివాలయాన్ని సందర్శించారు. అసెంబ్లీ పనులను కూడా పర్యవేక్షించారు. అమరావతి రాజధాని వ్యవహారాల విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెలగపూడి సచివాలయం ప్రారంభం అయిన తర్వాత.. అక్కడకు వెళ్లడం ఇదే ప్రథమం. గరువారం సాయంత్రం తమతమ నియోజకవర్గాల సమస్యల గురించి , వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపించడం గురించి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్న వైకాపా ఎమ్మెల్యేలు అమరావతి రాజధాని వద్ద సచివాలయం తదితరాలు కూడా పరిశీలించడం విశేషం.

అయితే ఈ సందర్భంగా సచివాలయ భవనాల నిర్మాణాలపై పలు అభ్యంతరాలు కూడా వారి వైపు నుంచి వ్యక్తం అవుతున్నాయి. వెలగపూడి సచివాలయాన్ని ఒక రకంగా రికార్డు సమయంలో పూర్తి చేశారు. అంత ఆధునాతనమైన హంగులతో , సాంకేతిక వసతులతో విశాలమైన భవనాల్ని అంత తక్కువ సమయంలో పూర్తి చేయడం విశేషమే. తొలుత అనుకున్న మూడు నెలల గడువుకంటె కొన్ని వారాలు ఎక్కువే అయినప్పటికీ.. అనుకున్నట్లే పూర్తి చేశారు. అయితే ఈ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించలేదని వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపిస్తుండడం విశేషం.

వైకాపా ఎమ్మెల్యేల్లోనూ పెద్దపెద్ద నిర్మాణ కాంట్రాక్టులు చేసే అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లు ఉన్నారు. అలాంటి వారిలో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉండే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఒకరు. ఆయన కూడా సచివాలయ భవనాల ప్రమాణాల విషయంలో వందల కోట్లతో నిర్మించిన భవనాల్లో ఉండాల్సిన స్థాయిలో లేవని అంటున్నారు. పెద్దిరెడ్డి అనుభవం దృష్ట్యా వారు చెబుతున్న అభ్యంతరాలు, ప్రమాణాలు, నాణ్యత విషయంలో లోపాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే.

అయితే ఇక్కడ సామాన్యులకు కలిగే సందేహం ఒకటుంది. సచివాలయం మొత్తం పూర్తయిపోయిన తర్వాత.. కొన్ని నెలలకు ఇలా వైకాపా ఎమ్మెల్యేల బృందం వచ్చి.. నాణ్యత, ప్రమాణాలు లేవని లోపాలు వెతికే బదులు, నిర్మాణ సమయంలోనే ఒకసారి వచ్చి ఉంటే , నాణ్యతను పరిశీలించి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది కదా అనేది ప్రజల ప్రశ్న. వెలగపూడి సచివాలయాన్ని నిర్మించినది చంద్రబాబు ప్రభుత్వమే కావొచ్చు. కానీ అది ఆయన వ్యక్తిగత లేదా పార్టీ సొత్తు కాదు. జాతి సొత్తు. మరి అలాంటిదాని విషయంలో ఇప్పుడు వచ్చి తప్పులు చెప్పడం కాకుండా.. ముందే వచ్చి ఉంటే జాతి ఆస్తిని కాపాడిన వాళ్లయి ఉండేవాళ్లని జనం అనుకుంటున్నారు.

Similar News