Weather Report : వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. ముగింపు ఎన్నడో కదా?
చలితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వణుకుతున్నాయి
చలితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వణుకుతున్నాయి. సీజన్‌లోనే కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత పదిహేను రోజుల నుంచి చలి గాలులు చంపేస్తున్నాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉత్తరాదిన వీస్తున్న చలిగాలులతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ ముందుగానే చెప్పినట్లుగా చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పినా ఇంత తీవ్ర స్థాయిలో ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఎండకు తట్టుకోలేం. కానీ ఇంత చలితీవ్రతను కూడా తట్టుకోలేమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలోనూ ఎన్నడూ లేని విధంగా...
ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా చలితీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. చివరకు ఎప్పుడూ ఎండలు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాయలసీమ ప్రాంతంలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఎప్పుడూ జనవరిలోనూ ఇంత చలి ఉండదు. అలాంటింది నవంబరు రెండో వారం నుంచి మొదలయిన చలిగాలులు ఇప్పటి వరకూ రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి డుంబ్రిగూడలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో చలితీవ్రతకు...
తెలంగాణలో అత్యంత చలితీవ్రత ఎక్కువగా ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. పలుచోట్ల సింగిల్ డిజిట్ కు చేరాయి. హైదరాబాద్‌లో కనిష్ఠంగా 6.3 డిగ్రీలు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 4.5 డిగ్రీలు నమోదు కాగా, ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యల్పం.ఈ చలి తీవ్రత డిసెంబర్ 11న నమోదైన చలిగాలుల స్థాయికి సమానంగా ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న కొన్ని రోజులు కూడా ఇదే స్థాయిలో చలిగాలులు కొనసాగనున్నాయి. డిసెంబర్ ప్రారంభం నుంచే రాష్ట్రంలో చలిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.చలి తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడానికి వెనుకాడుతున్నారు. రోజువారీ జీవనంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై చలి ప్రభావం చూపుతోందని వైద్యులు సూచిస్తున్నారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.