Chandrababu : ప్రయివేటు అంటే అంత ప్రేమ.. అదే అభివృద్ధికి ఆసరా అవుతుందనే నమ్మకమే
చంద్రబాబు నాయుడు అంతే..ఆయన ప్రయివేటు వ్యక్తుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు
చంద్రబాబు నాయుడు అంతే..ఆయన ప్రయివేటు వ్యక్తుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు. అది ఆయన బలం..బలహీనత కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నిజాం షుగర్స్ ను కారు చౌకగా కట్టబెట్టారు. అలాగే ఆల్విన్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయి. ఒకటి కాదు.. రెండు కాదు అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీచంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే మూతపడటమో.. ప్రయివేటు వారికి అప్పగించడమో జరిగిపోయాయి. ఆ ముద్ర చంద్రబాబుపై ఇప్పటి నుంచి కాదు దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రయివేటు వ్యక్తులకు భూములు ధారాదత్తం చేస్తుంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ప్రజల్లో వ్యతిరేకతను కూడా...
కానీ ప్రజల్లో అదే వ్యతిరేకతకు కారణమని చంద్రబాబుకు చాలా ఎన్నికల్లో తెలిసింది. అయినా సరే అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. విశాఖలోనూ, రాజధాని అమరావతిలోనూ కారు చౌకగా భూములు కట్టబెట్టడం, విశాఖలో రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువధరలకు భూములకు కేటాయించడం అనేక విమర్శలకు దారి తీస్తున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు లెక్కచేయడం లేదు. లూలూ మాల్ కోసం ఏకంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని కేటాయించేందుకు రెడీ అయ్యారు. ఎన్నిఅభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన లూలూ మాల్ వస్తే విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారే కానీ.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆయన పట్టించుకోవడం లేదు.
విశాఖలో ఖరీదైన భూములను...
అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలైన రహేజా, సత్వా లాంటి సంస్థలకు అతి తక్కువ ధరలకు విశాఖలో ఖరీదైన భూములను అప్పనంగా అప్పచెప్పడం కూడా అదే కారణం. వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారని తెలిసినా వారికి భూములు ఇస్తున్నారు. వస్తున్న విమర్శలను లెక్కపెట్టడం లేదు. ఇక మెడికల్ కళాశాలల విషయంలో ఎందుకు వెనక్కుతగ్గుతారు? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనల్లో కొంత నిజముందనిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాలపై ప్రజల్లోనూ నమ్మకం పోయిన నేపథ్యంలో ప్రయివేటు వారికి అప్పగించడంలో తప్పులేదు కానీ, కానీ దానికి ఒక ఎండ్ అంటూ ఉండాలన్నది సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తున్న మాటలు. అయినా చంద్రబాబు మాత్రం లెక్క చేయరు. ఆయన నైజం.. పాలన అంతే.