Bangladesh : బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు.. ప్రభుత్వం కఠిన చర్యలు
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసులో పది మందిని అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసులో పది మందిని అరెస్ట్ చేశారు. మైమెన్సింగ్ ఘటనపై ఆర్‌ఏబీ, పోలీసుల సంయుక్త చర్య చేపట్టి ఈ అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ మైమెన్సింగ్‌లో 27 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను దారుణంగా కొట్టి చంపిన ఘటనలో మొత్తం పది మందిని అరెస్ట్ చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఏడుగురిని పట్టుకోగా, పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.“మైమెన్సింగ్‌లో హిందూ యువకుడి కొట్టి చంపిన కేసులో 10 మందిని అరెస్ట్ చేశాం” అని ఆయన తెలిపారు.భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ పై జరిగిన దాడి కేసులో ఈ అరెస్టులు జరిగాయని చెప్పారు.
అరెస్ట్ చేసిన వారిలో...
ఆర్‌ఏబీ అరెస్ట్ చేసినవారిలో ఎండీ లిమోన్ సర్కార్ , ఎండీ తారెక్ హొస్సేన్ , ఎండీ మానిక్ మియా , ఎర్షాద్ అలీ , నిజుమ్ ఉద్దిన్ , ఆలమ్‌గీర్ హొస్సేన్ , ఎండీ మిరాజ్ హొస్సేన్ అకోన్ ఉన్నారు.పోలీసులు ఎండీ అజ్మోల్ హసన్ సాగిర్ , ఎండీ షాహిన్ మియా , ఎండీ నజ్ముల్‌ను అరెస్ట్ చేశారు. అధికారుల ప్రకారం, వివిధ ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. మతదూషణ ఆరోపణల పేరుతో దీపు చంద్ర దాస్‌పై గుంపు దాడి చేసి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించినట్లు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రైస్తవ ఐక్య మండలి ఈ హత్యను తీవ్రంగా ఖండించింది.
దీపు చంద్రదాస్ హత్యానంతరం...
డిసెంబర్ 18వ రాత్రి గార్మెంట్ కార్మికుడైన దీపు చంద్ర దాస్‌ను దుండగులు అమానుషంగా కొట్టి, చెట్టుకు కట్టి నిప్పంటించారని మండలి తెలిపింది. ఈ ఘటన మత సామరస్యాన్ని దెబ్బతీసిందని పేర్కొంది. ఈ ఘటన దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చోటుచేసుకుంది. విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హాది మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో ఆందోళనలు పెరిగాయి. ఇన్‌కిలాబ్ మోంచో కన్వీనర్‌గా ఉన్న హాది, 2026 ఫిబ్రవరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో రిక్షాలో వెళ్తుండగా ఆయనపై మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హాది సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న మృతి చెందారు. శనివారం ఆయన అంత్యక్రియలు బంగ్లాదేశ్‌లో జరిగాయి.