Ys Jagan : జగన్ ఆ రిస్క్ తీసుకుంటారా? అందులో నిజమెంత?
వైసీపీ అధినేత జగన్ అనేక మంది నాయకులను వచ్చే ఎన్నికలలో పక్కన పెట్టేస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
వైసీపీ అధినేత జగన్ అనేక మంది నాయకులను వచ్చే ఎన్నికలలో పక్కన పెట్టేస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కొడాలి నాని, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విడదల రజని ఇలా అనేక మంది నేతలకు ఈ సారి నియోజకవర్గాలను మార్చడమో... లేక పక్కన పెట్డడమో చేస్తారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో జగన్ సీనియర్ నేతలకు ప్రత్యామ్నాయంగా యువ నేతల కోసం చూస్తున్నారని అంటున్నారు. అందులో నిజమెంత అన్నది మాత్రం వైసీపీ నేతలు చెప్పకపోయినా.. 2029 ఎన్నికల్లో మాత్రం జగన్ అలాంటి సాహసం చేయకపోవచ్చన్న అభిప్రాయం మాత్రం బలంగా పార్టీ లోనే వినపడుతుంది.
మొన్నటిఎన్నికల్లోనే...
2024 ఎన్నికల్లోనే మంత్రులను, ముఖ్యమైన నేతలను నియోజకవర్గాలను మార్చి జగన్ చేతులు కాల్చుకున్నారు. ఈసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నగిరి నియోజకవర్గానికి, ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి, విడదల రజనీని రేపల్లెకు పంపాలని దాదాపు డిసైడ్ అయ్యారన్న ప్రచారం ఉంది. ఇక ఆర్కే రోజాకు ఈసారి ఎక్కడా సీటు ఇవ్వకుండా అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ ఇస్తారంటున్నారు.ఇందులో నిజం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ యా నియోజకర్గాల్లో ఆ నేతలు విపరీతంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కొత్త నాయకత్వం వస్తే మళ్లీ రెండు గ్రూపులవుతాయి. అందువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పైగా ఈ నేతల వల్ల పార్టీకి నష్టమేమీ లేదని, అటువంటి వారిని ఎందుకు తప్పిస్తారన్న ప్రశ్న ఎదురవుతుంది.
కావాలనే ప్రచారమా?
వైసీపీని బద్నాం చేయడానికి కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దంటూ నేతలకు వైఎస్ జగన్ ఇటీవల వారికే స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయాలని, ప్రజాసమస్యలపై స్పందిస్తూ ఆందోళనకు దిగాలని జగన్ వారికి సూచించినట్లు సమాచారం. క్యాడర్ ను కూడా కాపాడుకుంటూ ప్రజల పక్షాన నిలస్తే టిక్కెట్ అదే వస్తుందని జగన్ చెబుతుండటంతో వారికి భరోసా వస్తుందట. పెద్దిరెడ్డినే తీసుకుంటే ఆయన తన నియోజకవర్గమైన పుంగనూరును వదిలపెట్టి బయటకు వచ్చే ప్రసక్తి ఉండదని చెబుతున్నారు. అలాగే కొడాలి నానిని మించిన నేత గుడివాడలో దొరకడం కూడా వైసీపీకి కష్టమే అవుతుందని, అందువల్ల జగన్ ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నటాక్.