KCR : నయా స్ట్రాటజీతో గులాబీ బాస్ వచ్చేస్తున్నాడటగా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. జనంలోకి రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్ల తర్వాత ఆయన తిరిగి యాక్టివ్ అయ్యేటట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయిన కేసీఆర్ ఇక తెలంగాణ రాజకీయాల్లో వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లుంది. బీఆర్ఎస్ వరస ఓటములతో పాటు అనేక పరిణామాలు ఆయనను తిరిగి యాక్టివ్ చేస్తున్నాయంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఇవ్వాలని అన్నారు. రెండేళ్లు పూర్తి కావడంతో ఇక ఫామ్ హౌస్ నుంచి జనంలోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పార్టీ శ్రేణులలో కూడా భరోసా నింపాలన్న ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు.
వ్యూహాత్మక నిర్ణయాలతో...
అందులో భాగంగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా దాదాపు నిశ్శబ్దం పాటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జనంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని చర్చలను ఆయన ఫామ్‌హౌస్ నుంచే నడిపిస్తుండగా రేపు అయితే ప్రత్యక్షంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్సీ–రాష్ట్ర కార్యవర్గాల సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ స్వయంగా అధ్యక్షత వహించనుండటం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ప్రధాన అంశాలివే...
కృష్ణా, గోదావరి సాగునీటి హక్కుల పరిరక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై వ్యూహాత్మక చర్యలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బలమైన ప్రణాళిక అంటూ కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. తాము ప్రభుత్వం సమయంలో 91 టీఎంసీల కేటాయింపుల కోసం ప్రణాళికలు రూపొందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే అంగీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేరుతోందని, రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ అడ్డుకోవడంలో వైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ బహిరంగంగా ఆక్షేపణలు చేసే అవకాశముంది.