Andhra Pradesh : ఏపీ సర్కార్ కొత్త పథకం.. ఇద్దరు బిడ్డలుంటే వారికి బంపర్ ఆఫర్
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై రెండో శిశువుకు జన్ననిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జనాభా తగ్గుతుండటంతో ఈ రకమైన నిర్ణయాన్ని త్వరలోనే చంద్రబాబు తీసుకుంటారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దేశంలోనే కాదు.. ఏపీలోనూ అందులో దక్షిణాది రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీంతో ఏపీ ప్రభుత్వం రెండో బిడ్డను కంటే ప్రోత్సాహకాలు ఇచ్చే యోచనలో ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వృద్ధుల జనాభా పెరగడంతో పాటు సంతానోత్పత్తి రేటు తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది.
జనాభా తగ్గుతున్న విషయాన్ని పదే.. పదే...
ఇదే విషయాన్ని చంద్రబాబు పదే పదే అనేక బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నారు. ప్రతి వారు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కలిగి ఉండాలని చెబుతూ వస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక భారం దృష్ట్యా చాలా మంది సింగిల్ శిశువుకే పరిమితమవుతున్నారు. దీంతో పాటు సంతాన సాఫల్యత పెంచేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. జనాభా నియంత్రణ నుంచి జనాభా సుస్థిరత వైపు ప్రభుత్వ పాలసీని మార్చుకుని చంద్రబాబు ఆ దిశగా త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
సంతానోత్పత్తి రేటు తగ్గడంతో...
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఆందోళనకరంగా పడిపోవడంతో, భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పరిణామాలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్, హంగేరీ వంటి దేశాల్లో అమలు చేస్తున్న తరహాలో 'రెండో బిడ్డను కనేవారికి' ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఇటీవల అమరావతిలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ఈ ఆందోళనకరమైన గణాంకాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ బయటపెట్టారు. జాతీయ సగటు 28.4 ఏళ్లతో పోలిస్తే, ఏపీలో సగటు వయసు 32.5 ఏళ్లుగా ఉందని, ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందనడానికి సంకేతమని ఆయన వివరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది సాధారణంగా ఉండాల్సిన 2.1 కంటే చాలా తక్కువని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ. పనిచేయని వయసు జనాభా పెరుగుతోంది. ఇకపై పిల్లల్ని కనేలా కుటుంబాలను ప్రోత్సహించడంపైనే మన దృష్టి పెట్టాలనడం దీనిని సూచిస్తుంది.