Janasena : పవన్ ముందు బోరుమన్న జనసేన ఎమ్మెల్యేలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదిస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదిస్తున్నారు. అయితే ఇక్కడ వారి నుంచి పవన్ కూడా కొంత ఫీడ్ బ్యాక్ అందుతుందట. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ ఛార్జుల పెత్తనం అధికంగా ఉంటుందని ఎక్కువ మంది పవన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం. తాము ఎంతగా సర్దుకుపోతున్నప్పటికీ అన్ని విషయాల్లో తలదూర్చడంతో తమను అధికారులు కూడా ఎమ్మెల్యేలుగా గుర్తించడ లేదని కొందరు ఎమ్మెల్యేలు వాపోయినట్లు తెలిసింది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తీసుకునే క్రమంలో భాగంగా తమను డమ్మీలుగా చూస్తున్నారని కూడా కొందరు ఆవేదన చెందినట్లు సమాచారం.
వన్ టూ వన్ సమావేశంలో...
తొమ్మిది మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, లోకం నాగమాధవి, దేవ వరప్రసాద్, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్ లతో చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ వారికి క్లాస్ తీసుకున్నారు.ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలకు పైగా పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల రిపోర్ట్స్ తెప్పించుకుని, ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలతో జనసేనాని మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అందరినీ కలుపుకుని పోవాలంటూ...
అయితే తాను చంద్రబాబుతో ఈ విషయాన్ని మాట్లాడతానని, అయితే కూటమి నేతలను కూడా కలుపుకుని పోయేలా వ్యవహరించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వారిని కూడా భాగస్వామ్యుల్ని చేయాలని పవన్ సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా తొలుత జనసేన క్యాడర్ కు కూడా అందుబాటులో ఉంటూనే వారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో ఎమ్మెల్యేలు పనితీరును మెరుగుపర్చుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కూటమి నేతల మధ్య సమన్వయం అవసరమనితెలిపారు. కూటమి నేతలు ఐక్యంగా ఉన్నారని ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపగలగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిసింది.