రేవంత్ రెడ్డి పార్టీని కులమయం చేస్తున్నారంట!

Update: 2016-11-25 17:10 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ.. పార్టీలో మిగిలిన వారి మధ్య విభేదాలు మాత్రం దండిగానే కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ముమ్మరంగా పోరాడడం... చీటికి మాటికి విమర్శలతో కేసీఆర్ సర్కారును చికాకు పెట్టడంలో తెలుగుదేశం తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్కరే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను మాత్రమే కాదు.. ఇతర విపక్షాలు కాంగ్రెస్, వామపక్షాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా కూడా.. రేవంత్ రెడ్డి వారి ఉద్యమాల్లో పాల్గొంటూ... తమ సొంత పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ తరఫున చేపడుతున్న నిరసనలు, యాత్రల్లో అన్ని వర్గాలకు చెందిన స్థానిక నాయకులను కలుపుకుపోకుండా.. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నల్గొండ జిల్లాకు చెందిన తెదేపా నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి వారు ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి తన యాత్రలు, కార్యక్రమాల్లో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ నల్గొండ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి గతంలో కూడా కులపరమైన వ్యాఖ్యలు చాలానే చేసి, రకరకాల వివాదాల్లోకి తనంతగా వెళ్లిపోయారు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటున్నదనే విషయంలో కూడా ఆయన కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తన చుట్టూ వివాదాలను సృష్టించుకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నల్గొండ నాయకులు చంద్రబాబునే కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

Similar News