’’కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదు. రాజకీయంగా వారు బాగానే ఉన్నారు. మంచి పదవుల్లోనే ఉన్నారు. దాని గురించి వారు అడగను కూడా లేదు. వారికి కావాల్సినదెల్లా ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు నిలదొక్కుకోవడం, విద్య ఉద్యోగాల్లో అవకాశాలను చేజిక్కించుకోవడం మాత్రమే.‘‘ అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడం ద్వారా ఆ వర్గంలో మంచి పేరు దక్కించుకోవడానికి, రాజకీయ ప్రయోజనానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నెపం మీద ఎలాంటి శషబిషలకు పోకుండా.. కాపు వర్గానికి రాజకీయ రిజర్వేషన్ల అవసరం లేదంటూ ఆయన తెగేసి చెప్పేశారు.
శుక్రవారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నంత మాత్రాన బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుందని చంద్రబాబునాయుడు చెప్పారు. బీసీ రిజర్వేషన్లలో ఒక్క శాతం కూడా కోత పడకుండానే కాపులకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని ఆయన అంటున్నారు.
చంద్రబాబునాయుడు కాపు రిజర్వేషన్ లను కార్యరూపంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల.. ఆ సామాజిక వర్గంలో డివైడ్ టాక్ ఉందనే చెప్పాలి. ఒకవైపు ఫక్తు తెలుగుదేశం కాపు నాయకులు మాత్రమే కాకుండా, ఆ వర్గంలోని తటస్థులు చాలా మంది కూడా.. రిజర్వేషన్ కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని ఆమోదించే స్థితిలో ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం.. చంద్రబాబునాయుడు కావాలనే జాప్యం చేస్తున్నారని, కాపులకు ద్రోహంచేస్తున్నారని ఇంకా అనేక రకాల ఆరోపణలతో మరో అభిప్రాయాన్ని తమ సామాజిక వర్గంలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి మొహమాటానికి పోకుండా.. దాపరికాలు లేకుండా.. సామాజికవర్గం అభ్యున్నతికి మాత్రమే రిజర్వేషన్లు అవసరమని, రాజకీయ రిజర్వేషన్లు వారికి అనవసరం అని చంద్రబాబు చెప్పడం విశేషమే.