ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ గురించి ఇప్పటికే నానా బీభత్సంగా రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కేను వెతికే ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నదని ఏపీ పోలీసులు ప్రకటిస్తున్నారు. తద్వారా తమ వద్ద ఆర్కే లేడని, తాము పట్టుకుని అదుపులో ఉంచుకున్నాం అన్నది అవాస్తవం అని సంకేతాలు ఇవ్వడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మావోయిస్టు అనుకూల పక్షాల వాదనలన్నీ పోలీసుల వైపే వేలెత్తి చూపుతున్నాయి. వారి అదుపులోనే ఆర్కే ఉన్నాడని అంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్‌కె భార్య హైకోర్టులో వేసిన పిటిషన్ పై సోమవారం మద్యాహ్నం విచారణ జరిగింది.
తన భర్త ఆచూకీ తక్షణం తెలియజేయాలంటూ ఆర్కే భార్య , వెంటనే విచారించాల్సిన వ్యవహారంగా ఈ పిటిషన్ వేశారు. దీనిని సోమవారం మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. మావోయిస్టులైనా, సామాన్యులు అయినా ప్రజలందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నంటూ హైకోర్టు ఆదేశించింది. ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టవద్దని పోలీసులను ఆదేశించింది. ఆర్కే ఆచూకీ మాకు తెలియాల్సిందేనని హైకోర్టు పేర్కొనడం విశేషం.
తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది.
ఏమవుతుంది?
హైకోర్టు ఆదేశాలతో ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. తాము ఆర్కేను పట్టుకోవడం జరగలేదని, ఇంకా వెతుకుతూనే ఉన్నామని, ఆయన ఆచూకీ తెలియగానే హైకోర్టుకు నివేదిస్తామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం వ్యవహారం నీరుగారిపోతుంది. సోమవారం విచారణ సందర్భంగానే.. ఒదిశాలో జరిగి ఈ వ్యవహారానికి సంబంధించి తాము పూర్తివివరాలు చెప్పలేం అంటూ ప్రభుత్వ న్యాయవాది పేర్కొనడం విశేషం. అదే సమయంలో మావోయిస్టుల న్యాయవాది మాత్రం.. ఆర్కే తప్పించుకుని ఉంటే గనుక... మావోయిస్టులకు ఉంటే పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా ఆ సమాచారం బయటకు వచ్చి ఉండేదని.. చూడబోతే.. పోలీసుల వద్దనే ఉన్నట్లుగా అనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా మావోయిస్టుల న్యాయవాది చెప్పారు.