రాష్ట్ర ముఖ్యమంత్రితో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు. వీరందరూ కలిసి మూకుమ్మడిగా సీఎంను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరగా.. గురువారం సాయంత్రం వరకు తేలలేదు. చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాము మాత్రం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి తీరుతాం అంటూ వైకాపా ఎమ్మెల్యేలు హెచ్చరిక స్వరంతో వ్యవహారాన్ని తీవ్రం చేసేందుకూ ప్రయత్నించారు. ఈలోగా సీఎం సానుకూలంగా స్పందించారు. భేటీకి సమయం ఇచ్చారు. అయితే ఈ భేటీ ద్వారా వైకాపా ఆశిస్తున్నది ఏంటి? వారి వ్యూహమేంటి? అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది.
ఎమ్మెల్యేలు వెళ్లి సీఎంతో నేరుగా సమావేశమై తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేయాలనేది జగన్ వేసిన ప్లాన్. తద్వారా నియోజకవర్గాల్లో సమస్యల గురించి ఎమ్మెల్యేలుగా తమ ప్రయత్నం తాము చేస్తున్న ప్రభుత్వమే స్పందించడం లేదని చాటుకోవచ్చునని ఆయన వ్యూహం.
అయితే తొలుత ఎమ్మెల్యేలను విడివిడిగా సీఎం అపాయింట్‌మెంట్ కోరుతూ వెళ్లి కలిసేలా ప్లాన్ చేయాలని, దానివలన సమస్యలపై సీఎం దృష్టి వచ్చి బాగుంటుందని జగన్ అనుకున్నారు. విడిగా తన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి కలిస్తే.. ఎవరికి ఎలాంటి ఆఫర్లతో చంద్రబాబు తన పార్టీలోకి చేరేలా ఫిరాయించేలా చేసేస్తారేమో అనే భయం ఆయనను వెన్నాడింది. అందుకే తన పార్టీలో మిగిలిన వారినందరినీ తన నేతృత్వంలోనే తీసుకుని సీఎం వద్దకు వెళ్లేలా చూస్తున్నారు.
అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి.. తమ తమ నియోజకవర్గాల సమస్యలు అన్నీ సీఎం దృష్టికి తీసుకువెళ్లడం అనేది ఒకే విడతలో సాధ్యమవుతుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే పరిష్కారం కంటె ముందు, ప్రయత్నం చేయడం, దానికి ప్రచారం వచ్చేలా చూసుకోవడమే లక్ష్యంగా ఉన్నాయి గనుక.. పార్టీలు ఆమేరకు స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది.