చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఇదే నిత్యకార్యక్రమం అయినట్లుగా బ్యాంకర్లతో సమావేశం పెట్టుకోవడం, జిల్లాల్లోని కలెక్టర్లను అందరినీ వీడియో కాన్ఫరెన్సులో సమావేశపరచడం అందరితో కలిసి ప్రజలకు ఎదురవుతున్న నోటు కష్టాల గురించి సమీక్షించడం చేస్తూ వచ్చారు. కొన్ని బ్యాంకులవద్ద మాత్రమే పరిమితంగా డబ్బు ఉన్న పరిస్థితుల్లో అన్ని బ్యాంకుల ద్వారా అందరికీ సర్దుబాటు చేసే రకరకాల ఏర్పాట్లను చేస్తూ వచ్చారు. సమాంతరంగా మరోవైపు కేంద్రానికి, రిజర్వు బ్యాంకు వారికి లేఖలు రాయడం, తమ రాష్ట్రానికి చాలినంత కొత్తనోట్ల నగదు కావాలనే విజ్ఞప్తితో వారి వద్దకు ప్రతినిధులను పంపడం వంటి అనేక ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలిసిన సంగతులే.
చంద్రబాబు కష్టం ఫలించిందనే అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బు ఎగురుకుంటూ ఆకాశమార్గంలో వచ్చింది. అవును.. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను సరైన రీతిలో రిజర్వు బ్యాంకు వారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించి.. ప్రత్యేక విమానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2420 కోట్ల రూపాయలను పంపారు. ఈ నగదును 13 జిల్లాలకు సమానంగా పంపిణీ చేయించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా నగదు కొరత వల్ల ప్రజలు కొత్తగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రజలకు నోటు కష్టాలు మొదలైన నాటినుంచి చంద్రబాబునాయుడు ప్రతిరోజూ బ్యాంకర్లతోనూ, కలెక్టర్లతోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా అసలు బ్యాంకుల్లో నగదే లేని నేపథ్యంలో ఆ మీటింగులన్నీ వృథా అవుతూ వచ్చాయి. చంద్రబాబు మాత్రం పట్టు వదలకుండా ఆర్బీఐ అధికారుల్ని ఫాలోఅప్ చేస్తూనే వచ్చారు. జైట్లీ ఫోను చేసి.. సీఎంల కమిటీకి సారథ్యం వహించమని అడిగినప్పుడు కూడా.. అసలు రాష్ట్రంలో నగదు రాలేదంటూ.. అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలుసు. ఇన్ని ప్రయత్నాల నడుమ ప్రత్యేకవిమానంలో ఏపీకి పెద్దమొత్తంలో డబ్బు రావడం విశేషం.