Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనం కోసం పడిగాపులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సహజంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. సోమవారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉంటున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ చేసింది. ఇక వరాహ స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఆలయాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా...
తిరుమలకు ఒక సీజన్ లేకుండా భక్తులు తరలి వస్తున్నారు. గతంలో వేసవి కాలంలో మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ నేడు కాలాలతోనూ, నెలలతోనూ సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు తరలివస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,582 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో : 19,757 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.