Telangana : మరో రెండు నెలలు తెలంగాణలో వరస ఎన్నికలు?
పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది
పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. వీలుంటే వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయంతో ఉంది. ఈ మేరకు త్వరలోనే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనుంది. త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలు...
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. కానీ అదే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులుంటాయి. అందులో స్పష్టంగా ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయన్నది తేలుతుంది. పట్టణ ప్రాంత ఓటర్లు తమకు పట్టం కడతారని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రభుత్వం తన పట్టును పట్టణాల్లో నిలుపుకునేందుకు ఈ మేరకు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరిపితే ఆశించిన ఫలితాలు దక్కుతాయని కాంగ్రెస్ భావిస్తుంది. ముందుగా పట్టణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటలను ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది.
జడ్పీ ఎన్నికలు...
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని నమ్ముతుంది. బీసీలు అండగా నిలుస్తారని, తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో కూడా జెండా ఎగురవేయవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో చర్చించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జడ్పీ ఎన్నికలు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ అభిప్రాయం కావడంతో ఆ మేరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఇక మరో మూడు నాలుగు నెలలు తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగే అవకాశముంది.