India vs South Africa : సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్.. నేడు ఎవరిది గెలుపు?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగే చివరి టీ 20 మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగే చివరి టీ 20 మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఆఖరిపోరులో గెలుపుపై ఇరు జట్లు కసరత్తులు ప్రారంభించాయి. లక్నో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఇప్పుడు ఈ మ్యాచ్ సిరీస్ ను సమం చేస్తుందా? లేక భారత్ సిరీస్ ను చేజిక్కించుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది. సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన భారత్, వన్డే, టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని కసితో ఉంది.
ఆధిక్యంలో ఉన్నా...
భారత్ ఇప్పటికే 2-1 సిరీస్ ఆధిక్యతతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే 3-1 తో టీం ఇండియా సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. అదే దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే 2-2గా సమం అవుతుంది. భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. శుభమన్ గిల్ గాయాల పాలు కావడంతో ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు లేవు. అతని స్థానంలో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇప్పటికే జట్టు నుంచి జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్ వైదొలిగారు. దీంతో భారత్ అభిమానులు ఒక రకంగా ఆందోళనలో ఉన్నారు.
ఒత్తిళ్లు ఎదుర్కొంటూ...
ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లేమితో అవస్థలు పడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఆఖరి మ్యాచ్ లోనైనా తన బ్యాట్ కు పని చెప్పాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాప్ ఆర్డర్ వైఫల్యం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది. అభిషేక్ శర్మ కూడా దూకుడుగా ఆడటమే తప్పించి అంతకు మించి పెద్దగా ఈ సిరీస్ లో ఇరగదీసింది ఏమీ లేదు. తిలక్ వర్మ ఒక్కడే కాస్త నిలకడగా ఆడుతున్నాడు. హార్థిక్ పాండ్యా రీ ఎంట్రీతో అదరగొట్టినా తర్వాత మ్యాచ్ లో మాత్రం నిరాశపర్చాడు. ఇలా అనేక ఒత్తిడుల మధ్య టీం ఇండియా నేడు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. మరి ఆఖరిపోరులో ఎవరిని విజయం వరిస్తుందన్నది వేచి చూడాల్సిందే.