ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతుంది. భారత వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మరికొద్ది రోజులు చలిగాలుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలుల వల్ల మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు, బాలింతలు వీలయినంత వరకూ ఇళ్లలోనే ఉండటం మంచిదని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయని, ఉదయం వేళ పొగమంచు దట్టంగా అలుముకుంటుందని తెలిపింది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాలను ఉదయం 9 గంటల తర్వాత మాత్రమే రహదారులపైకి రావాలని కోరారు. లేకుంటే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే చలి నుంచి కాపాడుకోవడానికి వెచ్చటి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.
రానున్న మూడు రోజుల పాటు...
తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలలో ఈ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అనేక ప్రాతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని పేర్కొంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని, ప్రజలువీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.