నోటు కష్టాలపై కేంద్రం అబద్ధాలు చెబుతోందా?

Update: 2016-11-25 11:04 GMT

‘‘నోటు కష్టాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ.. నోటు నిల్వల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకుల్లో డబ్బు సమృద్ధిగా ఉంది. ఎవ్వరూ భయపడవద్దు. అందరికీ సరిపడా డబ్బు పంపిణీ జరుగుతుంది’’ అనే మాటలనే కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు తొలిరోజునుంచి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వాస్తవంలో ఈ మాటలన్నీ అబద్ధాలే అని తేలుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం డబ్బు పుష్కలంగా ఉన్నది అని ప్రకటించేస్తూ ఉండగా, గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చుని వెళ్లిన తర్వాత.. బ్యాంకులు మాత్రం డబ్బు లేవు అని చెబుతూ ఉండగా.. గందరగోళానికి గురవుతున్న ప్రజలకు అవగాహన కలిగించడానికి , వారి సందేహాలను నివృత్తి చేయడానికి బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ వారు.. హైదరాబాదులో ఓ సదస్సు నిర్వహించారు. వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు.

ఉద్యోగులు చెబుతున్న ప్రకారం.. ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం, లేదా ప్రజల్లో వ్యతిరేకత ప్రబలకుండా ఉండడం కోసం ఎలాంటి మాటలు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో కనీసం మరో మూడు నాలుగు నెలల పాటూ ఈ నోటు కష్టాలు ప్రజలకు ఇలాగే కొనసాగుతాయని అంటున్నారు. నోటు కష్టాలు ఇప్పట్లో తీరేది లేదంటూ వారు చాలా తార్కికంగా చెబుతున్నారు. 2200 కోట్ల నోట్లను ప్రభుత్వం రద్దు చేసేసిందని.. నెలకు 300 కోట్లకు మించి నోట్లను ముద్రించే సామర్థ్యం రిజర్వు బ్యాంకు కు లేదని.. చిన్న డినామినేషన్ నోట్లు వేయాల్సి వస్తే.. ఇంకా ఆలస్యం అవుతుందని.. ఆ దామాషా ప్రకారం.. 4 నుంచి 6 నెలల వరకు ప్రజలకు నోట్లు సరిపడా అందుబాటులో ఉండని ఆర్థిక కష్టాలు తప్పవని బ్యాంక్ ఫెడరేషన్ చెబుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, బ్యాంకుల్లో డబ్బు సమృద్ధిగా ఉన్నది అని చెబుతూనే ఉంటే గనుక.. అవన్నీ అబద్ధాలు అని బ్యాంక్ ఫెడరేషన్ చెబుతోంది. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యల వలన ప్రజల దృష్టిలో బ్యాంకులపై దురభిప్రాయం ఏర్పడుతుందని చెబుతున్నారు. బ్యాంకుల వద్ద డబ్బు సరిపడా ఉన్న మాట వాస్తవమే అయితే గనుక బ్యాంకుల్లో కౌంటర్లు ఖాళీ ఎందుకు ఉంటున్నాయని, ఏటీఎం లు ఎందుకు పనిచేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ ప్రకటనలకు పరిమితం కాకుండా.. ప్రజలకు వాస్తవాలను వివరించి, ఆ మేరకు మరికొంత కాలం పాటు కష్టాలు పడడానికి వారిని సిద్ధం చేయాలని బ్యాంక్ ఫెడరేషన్ అంటోంది.

Similar News