తెలుగుదేశం- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాటలతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం మాత్రమే కాదు... సభాముఖంగా.. ఒకరిమీద ఒకరు కలబడి కొట్టుకోవడం కూడా రాష్ట్రంలో షురూ అవుతోంది. నెల్లూరు కార్పొరేషన్ లో ఇరుపార్టీల మధ్య వివాదాలతో కార్పొరేటర్లు కలబడి కొట్టుకోవడం శుక్రవారం చోటు చేసుకుంది. పంటకాల్వల మీద ఆక్రమణలను తొలగించడానికి సంబంధించి ప్రారంభమైన చర్చ శృతి తప్పి, గతి తప్పి.. ఇరు పార్టీల వారూ పరస్పరం కలబడడం దాకా వెళ్లడం విశేషం. వైకాపాకు చెందిన కార్పొరేటర్ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేశారు. తెలుగుదేశం కార్పొరేటర్లందరినీ సస్పెండ్ చేయాలంటూ వైకాపా కు చెందిన వారు డిమాండ్ చేయడంతో రభస పెరిగింది. కార్పొరేటర్లు మైకులను విరిచి ఆ రాడ్ లు పట్టుకుని.. ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి ఎగబడడం విశేషం.
వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్ పిడిగుద్దులకు తెదేపా కార్పొరేటర్ కిందపడిపోవడం కూడా మీడియా కెమెరాల సాక్షిగా స్పష్టంగా కనిపించడం విశేషం.
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస కావడం ఇది తొలిసారి కాకపోవడం విశేషం. పంటకాల్వల మీద ఆక్రమణలు తొలగింపు విషయంలో ముందు వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే ఆక్రమణలు తొలగించాలంటూ వైకాపా కార్పొరేటర్లు పట్టుబట్టిన దగ్గరినుంచి వివాదం ముదరడం విశేషం.