Ys Jagan : జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం కలుగుతుందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు. వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి టెండర్ల గడువును పెంచనుంది. అయితే ఈ స్పందన తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ హెచ్చరికలేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసులు పెట్టి మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న వారిని అరెస్ట్ చేస్తానని హెచ్చరించారు. ఆ హెచ్చరికలు పనిచేశాయని ప్రభుత్వ వర్గాలు కూడా గట్టిగా అభిప్రాయపడుతున్నాయి. అందుకనే టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదని చెబుతున్నారు.
తక్కువ స్పందన రావడంతో...
వైద్య కళాశాలల టెండర్లకు తక్కువ స్పందన మాత్రమే కనిపించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది.టెండర్ల గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించినప్పటికీ ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ దాఖలైంది. దీనికి గల కారణాలపై చర్చిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలు కావడంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరొకవైపు గడువు మరొకసారి పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది.
చంద్రబాబు ససేమిరా...
ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం చెందినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బెదరిస్తే టెండర్లకు కూడా ముందుకు రాకపోవడమేనని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. మరొకవైపు జగన్ ఈసారి అధికారంలోకి వస్తారా? అన్న అనుమానం పారిశ్రామికవేత్తల్లోనూ, ఇటు పెట్టుబడి దారుల్లోనూ కనిపిస్తుందా? అన్న అనుమానం కూడా ప్రభుత్వ వర్గాల్లో కలుగుతుంది. అందుకే పెట్టుబడులు పెట్టే వారు కూడా పెద్దగా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరొకసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినా జగన్ తిరిగి వస్తారన్న నమ్మకమే ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణమన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు మాత్రం పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కళాశాలలను అప్పగించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి ఈసారైనా టెండర్లలో పాల్గొంటారా? లేదా? అన్నది చూడాలి.