సమకాలీన ప్రపంచంలో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్న సబ్జెక్టు ఒక్కటే.. నోట్ల రద్దు వ్యవహారమే. నోట్ల రద్దు వలన ఏ స్థాయిలోని వారికి ఎలాంటి కష్టాలు వచ్చాయి.. ఆ కష్టాలనుంచి ఎలా బయటపడ్డారు.. ఈ వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ చర్చలకు నగదు రహిత లావాదేవీల వ్యవహారం కూడా తోడైంది. వీలైంతన వరకు మొబైల్, కార్డ్ లావాదేవీల వైపు దేశాన్ని మళ్లించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు ప్రభుత్వాలు రకరకాల కసరత్తులు చేస్తున్నాయి.
అయితే మోదీ నగదు రహిత లావాదేవీలు పెరగాలంటూ పిలుపు ఇవ్వడం అదే తడవుగా, దానిని ఆచరణలోకి తీసుకువచ్చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ.. పలువురి అభినందనలు అందుకున్నారు. దేశం మొత్తాన్ని ఆచరించాల్సిందిగా ఉపదేశించేవారు.. ముందు తాము ఆచరించి చూపడం అవసరం అనే సిద్ధాంతానికి నిదర్శనం లాగా... పార్లమెంటు ఆవరణలో క్యాంటీన్ లో నగదురహిత చెల్లింపుల ఏర్పాటును కొత్తగా ప్రారంభించారు. మోదీ చెబుతున్న సలహా మంచిదే అయినప్పుడు మన వద్దనుంచే దానిని ప్రారంభించాలనే ఉద్దేశాంతో క్యాంటీన్ వ్యవహారాలను చూసే.. ఫుడ్ కమిటీ ఛైర్మన్ అయిన తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి.. దీన్ని ఆచరణలోకి తెచ్చారు. క్యాంటీన్ లో ఈ విధానాన్ని స్పీకరు ద్వారా ప్రారంభింపజేశారు.
అతి తక్కువ వ్యవధిలోనే దీనిని పార్లమెంటు ఆవరణ లోనే అమల్లోకి తేవడం పట్ల స్పీకరు సుమిత్రా మహాజన్, ఫుడ్ కమిటీ ఛైర్మన్ జితేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విధంగా సంస్థల అధిపతుల స్థానంలో ఉన్నవాళ్లు, దుకాణాల యజమానులు ఇలా వ్యవస్థలో వివిధ దశల్లోని వాళ్లు తమంతగా చొరవచూపి స్వైపింగ్ మెషిన్లు వంటివి ఏర్పాటుచేసుకుంటే.. ఆటోమేటిగ్గా నగదు రహిత లావాదేవీలు అవే పెరుగుతాయని పలువురు అంటున్నారు.