తెదేపా: ఏపీ బలంలో తెలంగాణ వాటా 7 శాతమేనా?

Update: 2016-12-01 11:00 GMT

తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. గత ఏడాది 50లక్షల సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన తెలుగుదేశం ఈసారి సభ్యత్వం కోరుతున్న వారినుంచి వందరూపాయలు తీసుకుంటూ, వారికి జీవిత బీమా కల్పిస్తూ గొప్ప సదుపాయం కూడా ఏర్పాటుచేసి.. ఇంకా పెద్దసంఖ్యలో సభ్యత్వాలు వస్తాయని ఆశిస్తోంది. ఒక రకంగా గత ఏడాది కంటె సభ్యత్వాలు పెరిగే అవకాశం మెండుగానే కనిపిస్తోంది. కానీ రెండు రాష్ట్రాల మద్య వ్యత్యాసాన్ని గమనించినప్పుడు మాత్రం వాస్తవాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్న బలంలో కనీసం 7 శాతం కూడా తెలంగాణలో లేదంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.

ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు చేపట్టిన సభ్యత్వనమోదుకు రాష్ట్రవ్యాప్తంగా స్పందన అపూర్వంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇప్పటిదాకా ఏపీలో 38.5 లక్షల సభ్యత్వాలకు తెలుగుదేశం పార్టీ చేరుకుంది. తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిసెంబరు 15 వరకు పొడిగించారు కూడా. ఆలోగా అనుకున్న లక్ష్యాన్ని అందుకోవచ్చునని పార్టీ భావిస్తోంది.

అయితే తెలంగాణలోని గణాంకాలు చూస్తే ఖంగు తినాల్సిందే. ఈ వ్యవధిలో ఈ రాష్ట్రంలో వచ్చిన సభ్యత్వాలు 2.5 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ఉన్న బలంలో.. తెలంగాణ బలం 7 శాతం కూడా లేదన్నమాట.

అయితే తెలంగాణలో కూడా 2019 ఎన్నికల్లో తామే అధికారంలోకి వచ్చేయాలని కల గంటున్న తెలుగుదేశం అధినేతల స్వప్నం నెరవేరాలంటే.. సభ్యత్వాల పరంగా ఇంత తక్కువ స్పందన ఉన్నచోట చాలా ఎక్కువ కష్టమే పడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రైతు పోరుబాట ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల తెలంగాణలో సభ్యత్వ నమోదు పూర్తి శ్రద్ధతో కొనసాగలేదని, డిసెంబరు 15 గడువు వరకు ఫోకస్ పెంచితే.. పార్టీ బలం కూడా పెరుగుతందని నాయకులు ఆశాభావంతో ఉన్నారు.

Similar News

.