తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక నిర్మాణాత్మకమైన ఆలోచన చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనితీరు ఎలా ఉంటే బాగుంటుందో.. పథకాల్లో ఉన్న లోపాలేమిటో అధ్యయనం చేసి చెప్పేందుకు, సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఒక మేథో బ్యాంకును ఏర్పాటు చేసుకోబోతున్నది. ప్రధానంగా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉండే విద్య, వైద్యం, విద్యుత్తు, ఆరోగ్యం, సంక్షే మం వంటి రంగాల్లో ఆయా రంగాల్లోని నిపుణుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలని.. ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వం మీద పోరాటాలు కొనసాగించాలని తె- కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రావడం విశేషం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే తలా కొంత డబ్బులు విరాళాలుగా వేసుకుని, నిపుణులు నుంచి సమాచారాన్ని సేకరించడానికి అవసరమైన నిధిని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించారు.
కేసీఆర్ సర్కారు మీద అలుపెరగని పోరాటం సాగిస్తూ.. 2019 ఎన్నికల నాటికి ఎలాగైనా సరే తమ పార్టీ అస్తిత్వాన్ని ఘనంగా నిరూపించుకోవాలని కష్టపడి పనిచేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు సీఎల్పీలో సమావేశమయ్యారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు, పథకాల్లో అవినీతి, టూబెడ్ రూం ఇళ్లు, ఫీజులు ఇత్యాది రెగ్యులర్ తాము నిందిస్తూ ఉండే అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించారు. అయితే ప్రత్యేకించి నోట్ల రద్దు తరవాత రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి.. తగ్గిన రాబడి తదితర విషయాల మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈ అంశాలను చర్చించేందుకు తక్షణం శాసనసభ సమావేశం ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఎప్పుడూ ఉండే రాజకీయ డిమాండ్లే అయినప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు గుర్తించేలా, సరైన గాడిలో పనులు జరిగేలా సూచనలు పొందడానికి నిపుణులను, మేధావులను ఆశ్రయించాలనే నిర్ణయానికి రావడం మాత్రం గొప్ప సంగతే.
అయితే సామాన్యులకు కలుగుతున్న సందేహం ఒకటుంది. ప్రజలతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండే వివిధ రంగాలకు సంబంధించి నిపుణులు, మేధావుల సూచనలు స్వీకరించి ఆయా శాఖలను ఉద్ధరించాలనే ఆలోచన.. ప్రతిపక్షంలో ఉండగా చేస్తున్న పెద్దలు.. పదేళ్లపాటూ తాము పాలన సాగించిన రోజుల్లో ఎందుకు చేయలేదో అని జనం అనుకుంటున్నారు. ఆ పదేళ్లలో అడ్డగోలు పాలన సాగించకుండా, ఈ చైతన్యం, మంచి దృక్పథం వారిలో కలిగి ఉంటే ఈపాటికి ఆయా రంగాలకు ఎంతో మేలు జరిగి ఉండేది కదా అని అనుకుంటున్నారు. మరి మేథోబ్యాంకు రూపంలో ఇప్పటికైనా తె-కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు మంచిదే. కానీ ఆ ప్రయత్నం వల్ల రాజకీయ ప్రయోజనాలు కాకుండా, ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా వారు పనిచేస్తే బాగుంటుంది.