నల్లధనం నియంత్రించడానికి నోట్ల రద్దు అనే కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే.. మోదీ సారథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు అయిన జన్ ధన్ బ్యాంకు ఖాతాలనే నల్లధనం మార్పిడికి వాడుకోవడం పెచ్చుమీరడాన్ని కేంద్రం ప్రభుత్వం సహించలేకపోతోంది. నల్లకుబేరులు , తమ వేలితో తమ కన్నే పొడుస్తున్నట్లుగా సర్కారుకు అసహనం కలుగుతున్నట్లుంది. అందుకే జన్ ధన్ ఖాతాల్లో జరిపే లావాదేవీలకు సంబంధించి కొత్తగా మరికొన్ని నిబంధనలను జత చేసింది.
బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసుకుంటే గనుక.. ఎంత మొత్తం కావలిస్తే అంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉండేది. కొత్తగా నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన విపరీత పరిస్థితుల దృష్ట్యా పరిమితులు పెట్టారు. రోజుకు పదివేల రూపాయలకు మించకుండా, వారానికి 24 వేల రూపాయలకు మించకుండా అకౌంట్లనుంచి విత్ డ్రా చేసుకునేలా పరిమితులు విధించారు. అయితే నల్ల కుబేరులు ఇటీవల మోదీ సర్కార్ చొరవతో జీరో బ్యాలెన్స్ నిరుపేదల కోసం ఏర్పాటుచేసిన జన్ ధన్ అకౌంట్లను వాడుకుంటూ.. అందులో విచ్చలవిడిగా నగదు డిపాజిట్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం జన్ ధన్ అకౌంట్ల మీద పట్టు బిగించింది. ఆ ఖాతాలనుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్ డ్రా చేసే అవకాశం లేకుండా నిబంధన విధించారు. అది కూడా కేవైసీ పత్రాలు సమర్పించిన వారికి మాత్రమే. ఆ పత్రాలు కూడా ఇవ్వని వారికైతే 5వేలే పరిమితి. అంటే ఎవరైనా నల్లకుబేరులు జన్‌ధన్ ఖాతాల్లో సొమ్ము వేసి ఉంటే గనుక.. దాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడానికి సుమారు రెండు సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తుందన్నమాట.