జగన్ మధనం : 'గడప గడప'లో ఏం తెలుస్తోంది?

Update: 2016-12-02 21:13 GMT

వైఎస్ జగన్మోహనరెడ్డి మేధోమధనం చేయబోతున్నారు. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కొన్ని పోరాటాలు నిర్వహించడమూ, ప్రత్యేకహోదా గురించి పోరాడడమూ జరుగుతోంది గానీ.. వాస్తవంగా ప్రజల్లో ఏం అనుకుంటున్నారో.. ఎలాంటి స్పందన ఉంటున్నదో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా సర్వేలేమీ చేయించబోవడం లేదు. గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తమ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులే ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటికీ తిరుగుతూ ఉన్న నేపథ్యంలో వారి ద్వారానే ప్రభుత్వం గురించి తమ పార్టీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశాలు పెట్టుకున్నారు.

ఈనెల 5, 6 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కీలక నాయకులు హాజరవుతారు. గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు వెల్లడవుతున్న అంశాలేమిటో వారిద్వారా జగన్ తెలుసుకుంటారు. 5న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కాగా, 6న కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నాయకులతో సమావేశం ఉంటుంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద ప్రజల స్పందన ఎలా ఉంది? తమ పార్టీ సాగిస్తున్న ప్రజా పోరాటాలు... ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న తీరు గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? లాంటి అంశాలపై జగన్ వారినుంచి సమాచారం తీసుకుంటారు. ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా పార్టీ కార్యక్రమాల భవిష్య కార్యచరణ ప్రణాళిక సిద్ధం అవుతుందన్న మాట. ఎన్నికలు రెండేళ్ల తరువాతే వస్తాయని తెలిసినా.. ముందు జాగ్రత్తగా జగన్ తయారవుతున్నట్లుగా కనిపిస్తోంది.

Similar News

.