వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయడంలేదంటూ వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తమ పార్టీనుంచి ఫిరాయించి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను కేటాయిస్తున్నారని, అదే సమయంలో విపక్షం గనుక.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట పనులేమీ జరగడం లేదని వారు పేర్కొన్నారు.
నిజానికి ముందస్తుగా అనుకున్న ప్రకారం అయితే.. విపక్ష నేత వైఎస్ జగన్ సారథ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం వద్దకు వెళ్లాలని అనుకున్నారు. అయితే చివరికి అపాయింట్‌మెంట్ దొరికే సమయానికి పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల నేతృత్వంలో సుమారు 30 మంది మాత్రమే వెళ్లి కలిశారు. తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు.
అయితే వైకాపా ఎమ్మెల్యేల ధోరణి మొత్తం సింగిల్ పాయింట్ ఎజెండా అన్నట్లుగా మారిపోయింది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదు. అనే పాయింట్ మీదనే వారంతా ప్రధానంగా సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల సమస్యలను విడివిడిగా సీఎంకు చెప్పదలచుకున్న వారు కాస్త.. ఎమ్మెల్యే ఫండ్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఎన్నికలయ్యాక తొలి ఏడాది ప్రభుత్వం వద్ద డబ్బు లేదనే ఉద్దేశంతో ఊరకున్నామని, కానీ నియోజకవర్గాల్లో తమతో ఓడిపోయిన తెలుగుదేశం నాయకుల పేరిట నిధులు మంజూరు చేస్తూ పనులు చేయిస్తున్నారని, విపక్ష ఎమ్మెల్యేలను పనుల విషయంలో పట్టించుకోవడం లేదని వారంటున్నారు.
ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికే ఇవాళ కలవడం జరిగిందని వైకాపా ఎమ్మెల్యేలు భేటీ అనంతరం మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.