చంద్రబాబు బెదిరింపు పనిచేస్తుందా?

Update: 2016-10-03 02:51 GMT

రాజకీయంగా చిన్న చిన్న ఆశలు ఉండే వ్యక్తులందరినీ చంద్రబాబునాయుడు ఒక రేంజిలో బెదిరించడానికి ప్రయత్నించారు. అయితే నిజానికి ఆయన ప్రజలకు చెప్పదలచుకున్న విషయం మంచిదే.. వారి బాగును ఉద్దేశించినదే. అందుకోసం వారిని బెదిరించాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు ఒక తరహా బెదిరింపులకు వెళ్లారు గానీ.. ఆ బెదిరింపులు మాత్రం జనం మీద పనిచేసేవి కాదు. ఇంతకూ ఏంటా బెదిరింపులు .. ఏమీ కథ అనిపిస్తోంది కదా...!

చంద్రబాబునాయుడు స్వచ్ఛ్‌ ఏపీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్రారంభించారు. రాష్ట్రమంతా మరుగుదొడ్డి లేని ఇల్లు లేకుండా చేయాలన్నది ఈ పథకం కింద ఆయన ఆలోచన. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మించుకోని వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తాం అంటూ ప్రకటించారు.

అయినా, మరుగుదొడ్ల నిర్మాణం అనేది ఒక మంచి లక్ష్యం అయినప్పుడు, దానికోసం ఇలాంటి చిన్నస్థాయి బెదిరింపుల అవసరం లేదు. పైగా గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థలకు అనర్హులు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ మూడో బిడ్డను దత్తత ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి.. ఎన్నికల్లోకి దిగారు. ఇలాంటి వక్ర, మోసపూరిత పోకడలు పెరిగాయి.

పైగా ఇంటింటికి మరుగుదొడ్డి అనేది ఎన్నికలకు ముడిపెట్టవలసినంత పెద్ద విషయం కూడా కాదు. అంతకంటె మిన్నగా, మరుగుదొడ్డి లేనివారిని ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించం అని బెదిరించి ఉంటే బహుశా ఎక్కువ ప్రయోజనం ఉండేదేమో! ఒక ఊరిలో ఎన్నికల ఆసక్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ ఊరంతా బాగు పడాలి అంటే.. వారిలో అవగాహన పెంచడానికి స్ఫూర్తి నింపడానికి చంద్రబాబు చూడాలే తప్ప.. ఇలా వ్యర్థ చట్టాలు తెస్తాననే మాటలు అనవసరం అని జనం అనుకుంటున్నారు.

Similar News