హమాస్ ఆయుధాలు వీడాల్సిందే.. లేకుంటే నరకం చూపిస్తాం

గాజా విషయంలో హమాస్ నిరాయుధీకరణకు ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు

Update: 2025-12-30 02:44 GMT

గాజా విషయంలో హమాస్ నిరాయుధీకరణకు ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తే పూర్తిగా ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఫ్లోరిడాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మొదట్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తే సహించబోమని ట్రంప్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలు జరిగితే వాటిని పూర్తిగా తుడిచిపెడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఆయుధాలు వదిలేది లేదు...
గాజా కాల్పుల విరమణ రెండో దశపై నెతన్యాహూతో భేదాభిప్రాయాలున్నాయన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. ఒప్పందంలో ఇజ్రాయెల్ తన బాధ్యతలు నిర్వర్తించిందని, ఇప్పుడు బాధ్యత హమాస్‌పైనే ఉందని చెప్పారు. వాళ్లు ఒప్పుకున్నట్టు ఆయుధాలు వదలకపోతే తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించార. చాలా తక్కువ సమయంలో నిరాయుధీకరణ జరగాలని ట్రంప్ అన్నారు. అయితే హమాస్ సాయుధ విభాగం తమ ఆయుధాలు అప్పగించే ప్రశ్నే లేదని మరోసారి స్పష్టం చేసింది. ఆక్రమణ కొనసాగుతున్నంత వరకు తమ ఆయుధాలు వదలబోమని ఎజ్జెదీన్ అల్-ఖస్సాం బ్రిగేడ్స్ వీడియో ద్వారా వెల్లడించడం విశేషం. .
ఇరాన్ నుంచి ఘాటైన స్పందన...
ఇరాన్ సుప్రీంకోర్టు నేతకు రాజకీయ సలహాదారు అలీ షామ్‌ఖానీ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంపై దాడి జరిగితే తక్షణమే కఠిన ప్రతిచర్య ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, రక్షణ వ్యవస్థలు ఎవరి అనుమతులపై ఆధారపడినవి కావని, దాడి చేస్తే ఊహించని స్థాయిలో స్పందిస్తమని అని ఆయన ఎక్స్ లో స్పందించారు. ట్రంప్‌తో సమావేశం చాలా ఉత్సాహంగా సాగిందని నెతన్యాహూ చెప్పారు. అమెరికా అధ్యక్షుడికి ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఇజ్రాయెలేతర వ్యక్తికి తొలిసారి ఇవ్వడం కావడం గమనార్హం. గాజాలో తదుపరి దశగా పాలస్తీనా టెక్నోక్రాటిక్ ప్రభుత్వం ఏర్పాటు, అంతర్జాతీయ స్థిరీకరణ దళాల మోహరింపుపై తాను ఆసక్తిగా ఉన్నట్టు ట్రంప్ చెప్పారు. అయితే హమాస్ నిరాయుధీకరణే ప్రధాన అడ్డంకిగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.















Tags:    

Similar News