ఇంతకూ అపోలో ఆస్పత్రిలో అమ్మ జయలలిత పరిస్థితి ఎలా ఉంది. ఎన్నిరోజుల్లో చికిత్స పూర్తి చేస్తారు? అంటూ పబ్లిసిటీ ఇంటరెస్ట్‌తో పిటిషన్లు వేయడంలో అర్థం లేదంటూ మదరాసు హైకోర్టు ఓ దావాను కూడా కొట్టి పారేసిన రోజే సాయంత్రానికి అపోలో ఆస్పత్రి వైద్యులు రాష్ట్ర ప్రజలకు మరింత క్లారిటీ ఇచ్చారు. జయలలిత ఆరోగ్యం గురించి కాస్త సుదీర్ఘమైన బులెటిన్ ను వారు విడుదల చేశారు. రెండు పేజీల బులెటిన్ లో జయలలిత ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో, చికిత్స ఎలా జరుగుతోందో తెలియజెప్పారు. ఆమె ఆరోగ్య సమస్య సంచలనంగా మారిన తరవాత తొలిసారిగా.. ఆమె 'కోలుకుంటున్నారు' అనే పదం పేర్కొంటూ అపోలో ఆస్పత్రి వారు బులెటిన్ ఇవ్వడం గమనార్హం.
జయలలిత అనారోగ్యం, విషమ పరిస్థితి గురించి రెండు రోజుల పాటూ హైడ్రామా, హైటెన్షన్ నడిచినప్పటికీ.. అనంతరం అపోలో వైద్యులు ప్రతిరోజూ బులెటిన్ ఇస్తూనే ఉన్నారు. లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే వచ్చి వెళ్లిన రోజున కూడా బులెటిన్ ఇచ్చారు. ఆయా బులెటిన్లలో చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారు అని మాత్రమే పేర్కొన్నారు తప్ప.. కోలుకుంటున్నట్లుగా ఒక్క పదం వాడలేదు.
తొలిసారిగా గురువారం కోలుకుంటున్న వైనం బయటకు వచ్చింది. జయలలిత శ్వాసకోస వ్యాధులు, షుగర్, ఆస్తమా ఉన్నాయని వాటికి చికిత్స చేస్తున్నామని చెప్పారు. ఆమె మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని ఈ బులెటిన్‌లో పేర్కొన్నారు.
'అమ్మకొడుకు' రాకతో హైడ్రామా
జయలలిత దత్తపుత్రుడు సుధారన్ జయలలితను చూసేందుకు గురువారం సాయంత్రం అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. అయితే లోపలినుంచి అనుమతి తీసుకున్న తర్వాత పంపిస్తాం అంటూ ఆయనను బయటే చాలా సేపు కారులో ఉంచేశారు. దాదాపు గంటన్నర పాటూ సుధాకరన్ ఆస్పత్రి బయట కారులోనే ఉండిపోయారు. పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. అలాగే మరోవైపు జయలలిత మేనకోడలిని అని చెప్పుకుంటూ వచ్చిన దీపా జయకుమార్ అనే మహిళకు కూడా ఆస్పత్రి వద్ద చేదు అనుభవం ఎదురైంది.