తెలంగాణలోని యువతరానికి శుభవార్త ఇది. దసరా నాటినుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆరోజునుంచి పనిచేయడం ప్రారంభిస్తాయి. కొత్తగా 21 జిల్లాలు తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నాయి. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ కార్యాలయాలతో సహా అన్ని జిల్లాల్లో అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగాలు తొలిరోజునుంచే పనిచేయాల్సిందేనంటూ కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు ఇచ్చారు.
అయితే హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి పోలీసు ఉన్నతాధికార్లతో నిర్వహించిన సమీక్ష, ఇతర శాఖల అధికారుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. తెలంగాణలో భారీగా ప్రభుత్వోద్యాగాల భర్తీకి అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు.
ముందస్తుగా.. పోలీసు శాఖలో భర్తీల ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెబుతున్నారు. జిల్లాల సంఖ్యను బట్టి పోలీసు బలగాల పెంపు తక్షణావసరం అవుతుంది. అందుకే పోలీసుల భర్తీలు ముందుగా ఉంటాయని, తర్వాత విడతలుగా ఇతర ఉద్యోగాల భర్తీలు ఉంటాయని అనుకుంటున్నారు. అంటే త్వరలోనే తెలంగాణలో యువతరానికి కలలు తీరేలా.. కొలువుల జాతర ఉంటుందన్నమాట.