కాపు ఢంకా మళ్లీ మోగింది. ఒకసారి ఆత్మగౌరవ మహాపాదయాత్రను అనుమతుల పేరుతో ప్రభుత్వం అడ్డుకున్న తరువాత.. కొంత కాలం గ్యాప్ తీసుకున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తాజాగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమ నాయకులతో సమావేశమై భవిష్య కార్యచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈనెల 25 నుంచి రావులపాలెంనుంచి కాపు ఆత్మగౌరవ మహా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర అంతర్వేది వరకు సాగుతుంది. దీనికి సంబంధించి ఈనెల 11నుంచి వేర్వేరు కార్యక్రమాలు చేపడతారు.
అయితే ముద్రగడ గతంలో సంకల్పించిన పాదయాత్ర కూడా కేవలం అనుమతులు లేవనే కారణంతోనే ఆగిపోయింది. అనుమతి లేకుండా యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని, ఎలాంటి అల్లర్లు జరగకుండా బాధ్యత తీసుకుంటాం అని ముద్రగడ పూచీ ఇవ్వాల్సి ఉంటుందని డీజీపీ సాంబశివరావు, హోం మంత్రి చినరాజప్ప ఇద్దరూ కూడా అప్పట్లో తేల్చి చెప్పారు. అంతిమంగా యాత్ర ఆగిపోయింది.
అయితే తాజాగా కొత్త కార్యాచరణ ప్రకటించిన ముద్రగడ మాటల్లో కూడా 25నుంచి ప్రకటించిన పాదయాత్రకు కూడా అనుమతి అడిగే ఉద్దేశం కనిపించడం లేదు. తన యాత్రకు అనుమతి తీసుకోవాలని అంటోంటే.. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్రకు ఎవరు అనుమతిచ్చారు, అనుమతి తప్పనిసరి అని ఏ చట్టంలో ఉన్నదో చూపించండి.. అంటూ ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ మాటలను బట్టి.. అనుమతి అనే వివాదం మరోసారి రచ్చరచ్చగా మారినా సరే.. అనుమతి తీసుకుని యాత్ర చేసే ఉద్దేశం ఆయనకు లేదని అర్థమౌతోంది.
అవసరమైతే చేతులకు బేడీలు, కళ్లకు గంతలు కట్టుకుని పాదయాత్ర చేస్తాం అని ముద్రగడ అంటున్నారు. అయితే.. అంత ఖర్మం ఏం వచ్చింది.. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఒక నిబందన పెట్టినప్పుడు, వ్యవస్థను గౌరవించి అనుమతి తీసుకుంటే తప్పేముంది అనే వాదన కూడా అదే వర్గంలోనే కొందరిలో వినిపిస్తోంది. అనుమతి విషయంలో పట్టుబట్టి.. వివాదాన్ని ముదరబెట్టడం కంటె, అనుమతి తీసుకుని తాము కోరుకున్నట్లుగా పాదయాత్ర చేయడం వల్ల ఫలితం ఉంటుంది కదా అని వారు వాదిస్తున్నారు.
మరోవైపు జిల్లాలో సెక్షన్ 30 ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని... అప్పటిదాకా ఎలాంటి ధర్నాలు, సమావేశాలు, ఆందోళనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటిస్తున్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉన్నదని, దీనికి అనుమతి ఇవ్వకుండా, ఇది జరగనివ్వకుండా చూడాలని కోరుతూ ఓ న్యాయవాది మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇన్ని వివాదాల మధ్య.. ముద్రగడ తన పాదయాత్రను రాజకీయ వివాదంగా ఉంచడాన్నే ఇష్టపడతారా... లేదా, అనుమతి కోరి, అనుకున్న పని సాధిస్తారా? అనేది కీలకంగా ఉంది.