కాంగ్రెస్ పార్టీకి లేవు గనుక.. మరెవ్వరికీ ఉండరాదా...

Update: 2016-12-01 09:10 GMT

అతడు సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. పొలం కబ్జా చేస్తుండగా అడ్డుకోడానికి వెళ్లిన నాజర్ తో తనికెళ్ల భరణి ఇలా అంటాడు. ‘‘మీరింకా 1940 మోడల్ కారు మాత్రమే వాడుతున్నారనుకున్నాను... బ్రెయిన్ కూడా అప్పటిదే’’ అని! ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ ఆలీ మాటలను గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా అలాగే కనిపిస్తోంది. మాది 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అనిచెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, 150 ఏళ్ల పురాతనమైన ఆలోచనా సరళితోనే ఇప్పటికీ మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతుంది. వారి భావజాలం తిరోగమనం దిశగా ఉన్నదనిపిస్తుంది. ఎందుకనగా..

దేశంలో పెద్దనోట్ల రద్దు దరిమిలా ప్రజలందరూ కూడా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు ఆ కష్టాలనుంచి వారికి విముక్తి కలిగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ, విఫలమౌతూ ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాలను అలర్ట్ చేసేలా నిత్యం పోరాటాలు, విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతవరకూ వారు ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నారనే అనుకుందాం. అయితే.. పురోగమన ఆలోచనలనుంచి వెనక్కు లాగాలన్నట్లుగా మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది.

దేశం మొత్తాన్ని నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించాలని ప్రయత్నం జరుగుతూ ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాలూ ఆ బాధ్యతను తాము కూడా పంచుకుంటున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కూడా అందుకు అనేక రకాలుగా కసరత్తు చేస్తున్నారు. అయితే షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరికి బ్యాంకు ఖాతాలున్నాయి, ఎన్ని ప్రాంతాల్లో అంతర్జాలం సౌకర్యం ఉంది.. దీన్ని అమల్లోకి తెస్తే ఎలా? అని మాట్లాడుతున్నారు. అంతర్జాలం లేకపోతే దానికోసం పోరాడాలి గానీ.. అసలు ఆ పద్ధతే వద్దన్నట్లు మాట్లాడడం ఏంటో అర్థం కాని సంగతి. అలాగే ఆన్‌లైన్ లావాదేవీలు, కార్డు లావాదేవీలు చేయడానికి వాడవాడలోనూ ఒక బ్యాంకు ఉండాల్సిన అవసరం లేదని కూడా షబ్బీర్ ఆలీ గుర్తించాలి.

మరో కామెడీ ఏంటంటే.. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు ఇప్పటిదాకా పార్టీ ఆఫీసు, వార్తాపత్రిక, టీవీ ఛానల్ లేనే లేవని, అవన్నీ మీకెలా వచ్చాయని ఆయన గులాబీ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ షబ్బీర్ ఆలీ ఆలోచన ఏమిటి.. కాంగ్రెస్ పార్టీకి లేని వసతులు దేశంలో మరెవ్వరికీ, ఏ ఇతర పార్టీకి ఉండజాలదని ఆయన భావిస్తున్నారా? ఇంకా 150 ఏళ్ల కిందట ఆలోచనా సరళితోనే ఆయన ఆలోచిస్తున్నారా...? అనే అనుమానం కలుగుతోంది.

Similar News

.