నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఒకవైపు నానా కష్టాలు పడుతూనే ఉన్నారు. మంచికోసం పడుతున్న కష్టాలుగా వాటిని సహిస్తూ ఉన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి అవకాశం లేని ప్రభుత్వం, ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా ప్రజలను నానా పాట్లకు గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వెయ్యిరూపాయల నోట్లను పూర్తిగా రద్దుచేసేసిన తర్వాత, 500 రూపాయల నోట్లను ఈనెల 15వ తేదీ వరకు పెట్రోలు బంకులు, విమాన టికెట్లు, టోల్ రుసుములకు చెల్లించేలా అనుమతించడమే దీనికి ఉదాహరణ. అయితే ఈ కొద్ది రోజుల వ్యవధిలో ప్రజల కష్టాలు తీర్చేయడానికి తాము ఏం చర్యలు తీసుకున్నారో.. ఏం ఉద్ధరించేశామని.. ప్రజలకు ఇక ఇబ్బంది లేదని వారు అనుకుంటున్నారో తెలియదు గానీ.. ఈ రద్దయిన 500 నోట్ల చెల్లుబాటును 2వ తేదీ అర్ధరాత్రి వరకే పరిమితం చేశారు. ముందుగా ప్రకటించినట్లు 15 వ తేదీ వరకు కాకుండా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత.. 500 నోట్లు పెట్రోలు బంకుల్లో కూడా చెల్లవు. కేవలం బ్యాంకులో డిపాజిట్ చేసుకోడానికి మాత్రమే పనికి వస్తాయంతే.
ప్రజలకు నోటు కష్టాలు కొత్త నెల రాగానే మరింతగా పెరిగాయి. బ్యాంకుల వద్ద క్యూలైన్లు మళ్లీ కిలోమీటర్ల కొద్దీ తయారయ్యాయి. ఇప్పటికీ బ్యాంకుల్లో చాలినంత నగదు అందుబాటులో ఉండడం లేదు. పనిచేస్తున్న ఏటీఎంలలో నగదు నింపిన అరగంటకు, గంటకే ఖాళీ అయిపోతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల బయట నో క్యాష్ బోర్డులు కనిపించడం పరిపాటి అయిపోయింది. ప్రజల కష్టాలు అన్నీ మరింతగా ఇనుమడిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యల పట్ల ఎంత సానుభూతి ఉన్నప్పటికీ, కొంత అసహనం, వ్యతిరేకత రావడం సహజం.
అయితే.. అలాంటి ప్రజలకు వెసులుబాట్లు మరింతగా కల్పించి, వారిలో వ్యతిరేకత లేకుండా చేసుకోవడానికి బదులుగా.. ప్రకటించిన సదుపాయాలకు కూడా కత్తెర వేసేస్తూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్నదని ప్రజలు భావిస్తున్నారు.