ఈటెల మాట బాగుంది... జైట్లీ సిద్ధమేనా?

Update: 2016-12-02 05:52 GMT

నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తుతున్న అనేక రకాల ఇబ్బందులను పరిష్కరించడానికి, అతలాకుతలం అయిపోయిన అనేక రంగాలను చక్కదిద్దడానికి ప్రభుత్వాల్లో ఎవరికి తోచిన సలహాలు వారు చెబుతున్నారు. మార్గాలు సూచిస్తున్నారు. అంతిమంగా ప్రజల కష్టాలు తీర్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు ఈ నోట్ల దెబ్బకు సర్వనాశనం అయిపోయిన వివిధ వ్యాపార రంగాలు అనేకం ప్రభుత్వాల్ని ఆశ్రయించి తమకు పడిన దెబ్బకు ఉపశమనం కావాలంటూ విన్నవించుకుంటున్నాయి. కొత్తగా కొన్ని రాయితీలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ఒక సూచన ఆచరణాత్మకంగా సబబైనదిగా కనిపిస్తోంది.

నోట్ల రద్దు దెబ్బకు కార్పొరేట్ వ్యాపారాల సంగతి ఎలా ఉన్నప్పటికీ పౌల్ట్రీ, డెయిరీ, వ్యవసాయాధారిత పరిశ్రమలు అనేకం కుదేలైపోయాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ రంగాలను ఆదుకోవడానికి కేంద్రం చొరవచూపించాలని కోరుతూ ఈటెల రాజేందర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖ రాశారు. ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు తీసుకున్న బ్యాంకు రుణాలపై ఒక ఏడాదిపాటు వడ్డీల మారటోరియం విధించాలని, రుణాలను రీషెడ్యూలు చేయాలని, ఈఎంఐలు కూడా ఏడాదిపాటు చెల్లించే అవసరం లేకుండా వెసులుబాటు కల్పించాలని ఆయన జైట్లీకి రాసిన లేఖలో కోరుతున్నారు. ఈ ఆలోచన ఆయా రంగాలకు, పైగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు మేలు చేసేదిగానే ఉన్నది. కానీ, వడ్డీల మారటోరియం అంటే అందుకు బ్యాంకులు అంగీకరిస్తాయా? వారిని ఒప్పించడం కేంద్రానికి సాధ్యమవుతుందా? అనేది కీలకాంశంగా కనిపిస్తోంది.

తమాషా...

అచ్చంగా తన సొంత లాభం కోసం ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నట్లుగా ఈటెల మీద ఆరోపణలు చేయడానికి వీల్లేదు. అయితే ఈటెల రాజేందర్ స్వయంగా పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యక్తి కావడం ఆసక్తికరం.. ఆయనకు చాలా పెద్ద స్థాయిలో పౌల్ట్రీ వ్యాపారం ఉన్నదనేది చాలా మందికి తెలిసిన సంగతే.

Similar News

.