వాహనం కొన్నప్పుడు మనం చెల్లించే రోడ్ ట్యాక్స్ అనే రుసుము.. సర్కారు వారు రోడ్లు వేయడానికే కదా.. మరి మనం రోడ్డు మీద వాహనంలో వెళుతున్నప్పుడు మళ్లీ టోల్ రుసుము కట్టడం ఏ రకంగా సబబు.. అనే సింపుల్ సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. కానీ.. గ్లోబలైజేషన్ పుణ్యమాని అనివార్యంగా చొరబడిన కొత్త పద్థతుల్లో బీవోటీ కూడా ఒకటి. ఒక రోడ్డును చాలా మెరుగైన ప్రమాణాలతో ఓ ప్రెవేటు సంస్థ నిర్మిస్తుంది. వారికి నిర్మాణానికి సర్కారు సొమ్మలివ్వదు. (లేదా, పరిమితంగా ఇస్తుంది) తాము పెట్టుబడిగా పెట్టిన మొత్తం వసూలు కావడానికి వారు ఆ రోడ్డు మీద తిరిగే వాహనాల నుంచి కొన్నేళ్లపాటూ రుసుములు వసూలు చేసుకుంటారు. ఎంత రుసుములు అనేది వారి ఇష్టానుసారం ఉంటుంది... నిజానికి ఇది బహిరంగ దోపిడీ అనే అనాలి. అలాంటి దోపిడీకి అలవాటు పడిన టోల్ రుసుముల యజమానులు ఏకొంచెమూ ఆగలేకపోతున్నట్లున్నారు.
దేశమంతా ప్రజలు నోటు కష్టాలతో నానా పాట్లు పడుతూ ఉంటే.. సర్కారు ఈ ఇక్కట్లను తగ్గించడానికి కల్పించిన మినహాయింపులు టోల్ ల విషయంలో మాత్రం ఎత్తేశారు. టోల్ వసూళ్లు తిరిగి శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. మళ్లీ అదే చిల్లర చిక్కులు. ప్రతి టోల్ గేటు వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి.
రద్దయిన నోట్ల స్థానే తిరిగి ప్రజల అవసరాలకు తగినంతగా కొత్త నోట్లను ముద్రించి సకాలంలో సరఫరా చేయడం ప్రభుత్వానికి చేతకాదు కానీ.. టోల్ యజమానుల లబ్ధికోసం.. మళ్లీ ఇలాంటి చిల్లర కష్టాలను వాహనదారులకు కల్పించడానికి ఎగబడుతున్నారని జనం ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు.
పెట్రోలు బంకుల్లో పాత 500 నోట్లు చెల్లుబాటు అయ్యేలా పెట్టిన వెసులుబాటును కూడా సర్కారు కొన్ని రోజుల కిందట ఎత్తేసింది. ఈ ఒక్క ఏర్పాటు వలన ఏదో కొందరు కొన్ని 500 నోట్లు మారుస్తారు తప్ప.. నల్లకుబేరుల వందలకోట్లు ఖర్చు పెట్టి పెట్రోలు కొట్టించుకోవడం జరగదు కదా.. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సర్కారు కొంచెం ఉదారంగా ఉండాల్సింది అని జనాభిప్రాయం వ్యక్తం అవుతోంది. టోల్ గేట్ల వద్ద ఏర్పడుతున్న ఇబ్బందికర పరిస్థితులు, కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడం, కాలహరణం ఇవన్నీ కూడా.. నేషనల్ వేస్టేజీనే కదా.. కేవలం ఆ కొద్ది మొత్తం టోల్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే కక్కుర్తి సర్కారును ఆడిస్తున్నట్లుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.